జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం ఇప్పుడు అటూ ఇటూ కాకుండా అయిపోయిందా..? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. 2014 ఎన్నికలకు బిజెపి తెలుగుదేశం కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో మాత్రం వామపక్షాలతో కలిసి పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో ఆయనకు గట్టి షాక్ తగిలింది. ఇక అక్కడి నుంచి ఆయన కొన్ని రోజులు ఇప్పుడు సినిమా సెట్ లో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, అధికార వైసిపి ఎలా అయినా సరే విజయం సాధించాలని పట్టుదలగా పనిచేస్తుంటే ఇక్కడ మాత్రం జనసేన ప్రభావం చూపించే అవకాశాలు కనపడటం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్థులు ఇబ్బంది పడుతుంటే బయటకు వచ్చి, ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టక పోవడం ఇబ్బందికరంగా మారింది. తమ పార్టీ అభ్యర్థులను అధికార పార్టీ నేతల ఇబ్బందులు పెడుతూ ఉంటే అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయకపోవడం ఆందోళన కలిగించే విషయం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అయిన తర్వాత ఆయన రాజకీయాల మీద దృష్టి పెడతారని అంటున్నారు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా లైన్లో ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసినా కేంద్ర పెద్దల నుంచి ఆయనకు ఎటువంటి సహకారం అందడం లేదని అంటున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు మినహా కేంద్ర పెద్దలు ఆయన మాటను ఏవిధంగానూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీనితో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.