తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదని.. కానీ తన మద్దతు ఉంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తానని చెప్పారు. ఇక్కడ కూడా ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమని తెలిపారు. తమ భావజాలానికి దగ్గరగా వస్తేనే ఒకే.. అది బీజేపీ అయినా సరేనని పేర్కొన్నారు. తనది కొత్త పార్టీ అని.. నేతలు కూడా కొత్త వారేనని వెల్లడించారు.
“తెలంగాణలో మైనింగ్ దోపిడీ జరుగుతోంది. ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడాలి. తెలంగాణలో చిన్న పోలీసు ఉద్యోగానికి ఇన్ని పరీక్షలా? మరి ప్రజాప్రతినిధులకు ఎన్ని పరీక్షలు ఉండాలి? చాకలి ఐలమ్మ పోరాటం వల్లే జై తెలంగాణ అంటున్నాం. నేను తిట్లు తినడానికి, వీధి పోరాటాలకైనా సిద్ధం. ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో పాలన బెటర్. తెలంగాణ, ఏపీ సమస్యలు వేర్వేరు రెండింటినీ పోల్చలేం. ఎవరితో పొత్తు పెట్టుకున్నా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వదిలేసినట్టుగా వదలం. తెలంగాణ అసెంబ్లీలో 10మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలని కోరుకుంటున్నా’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.