స్వయం పాలన కోసం..నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసం పోరాడి తెలంగాణ ఆవిర్భివించింది. అలాంటి తెలంగాణలో ఇక్కడి మూలాలులేని ఇద్దరు నేతలు రంగంలోకి దిగబోతున్నారు. తెలుగు రాజకీయాల్లో ఇదే ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో రాజాన్న రాజ్యం కోసం షర్మిళ కొత్త పార్టీతో వస్తుండగా.. జనసేన కూడా తెలంగాణలో క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించింది. వీళ్ల రాకతో తెలంగాణ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలంగాణలో తెలంగాణేతర నేతలు అడుగుపెడుతామని చెప్పడంతో వారికి ఎలాంటి ఆదరణ ఉంటుందనే చర్చ మొదలైంది. తెలంగాణా గడ్డపై రాజకీయంగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు షర్మిళ సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్నారు. జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశాల తర్వాత పార్టీ పేరు, విధి విధానాలను ప్రకటించనున్నారు షర్మిళ. షర్మిళ రాజకీయ ప్రకటనపై రకరకాల విశ్లేషణలు, చర్చలు జరుగుతుండగానే..పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో పార్టీ విస్తరణ ప్రకటన చేసి మరింత ఆసక్తిని రేకెత్తించారు.
తెలంగాణ జనసేన మహిళా అభిమానులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ గా నిర్వహించడం, పార్టీ విస్తరణ చేయకపోవడంపై మహిళలు పవన్ ను ప్రశ్నించారు. దీంతో అప్పటికప్పుడు పవన్ కల్యాణ్.. ఇకపై తెలంగాణలో కూడా పార్టీ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించేశారు. 2014కు ముందు పవన్ కల్యాణ్ జనసేన పేరుతో హైదరాబాద్ లో పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టినా ఆ ఎన్నికల్లోకానీ..ఆ తర్వాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లోగానీ జనసేన తెలంగాణలో పోటీ చేయలేదు. తన దృష్టంతా ఏపీ మీదనే అన్నట్టు ఆ పార్టీ నడిచింది.
ఏపీలో బీజేపీతో పొత్తుతో ఉన్న జనసేనాని తెలంగాణలో కూడా ఆ పార్టీతోనే కలిసిపోవాల్సి ఉంటుంది. అందుకు తెలంగాణ బీజేపీ అంగీకరిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వయంపాలన కోసం తెలంగాణ తెచ్చుకుంటే పక్క రాష్ట్రం నుంచి పవన్ కల్యాణ్ ను తెచ్చుకున్నారని టీఆర్ఎస్, ఇతర పార్టీలు ఆరోపణలు చేసే ప్రమాదం ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోకపోడానికి అదే కారణం. తొలుత బీజేపీ పొత్తు కోసం ఎదురు చూసిన పవన్.. ఆ పార్టీ ప్రతిపాదన చేయకపోవడంతో ఒంటరిపోరుకు సిద్ధం అయ్యారు.
టీఆర్ఎస్ తో అసలే టైట్ ఫైట్ నడుస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేస్తే.. ఎఫెక్ట్ పడుతుందని భావించారు తెలంగాణ బీజేపీ నేతలు. దీంతో ఢిల్లీ నేతల జోక్యం చేసుకుని జనసేనను పోటీ నుంచి వైదొలగేలా చేశారు. మరి ఇప్పడు తెలంగాణలో పవన్ ప్రయాణం ఒంటరిగా ఉంటుందా బీజేపీతో కలిసే ఉంటుందా? అనేది చూడాలి. ఎందుకంటే గతంలో పవన్ కల్యాణ్.. చాలా సందర్భాల్లో కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు బీజేపీతో కలిసి జనసేన.. తెలంగాణలో నడవాల్సి వస్తే.. అందుకు భిన్నమైన స్టాండ్ ను పవన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటు షర్మిల రాజకీయ పార్టీపై ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. పక్కరాష్ట్రంవారి నాయకత్వం తమకు అవసరం లేదంటున్నాయి. వాటికి ధీటుగా తాను తెలంగాణ కోడల్ని అంటూ ముందుకు వెళ్లాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఓ పక్క తెలంగాణ చాంపియన్ అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్, ఇంకోవైపు తెలంగాణ ఇచ్చింది మేమేనని చెప్పినా… రెండుసార్లూ గెలవలేకపోయిన కాంగ్రెస్, ఇంకోవైపు ఇలాగైనా ఈసారి గెలవాలనుకుంటున్న బీజేపీ. ఇన్ని పార్టీల మధ్య.. ఆత్మగౌరవం, విధులు, నిధులు, ఉద్యోగాల కోసం పోరాడి పోరాడి సాధించుకున్న తెలంగాణలో షర్మిళకు ఆదరణ ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
తన మూలాలను ప్రశ్నిస్తున్న వారికి ఘాటుగా సమాధానాలు చెబుతున్న షర్మిళ… ఏపీలో ఒకే ఒక్క సీటుకు పరిమితమై పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్.. తెలంగాణ రాజకీయాల్లో మెరుస్తారో… వెలిసిపోతారో చూడాలి.