టాలీవుడ్ సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి.. ఇటీవల మాస్ మహారాజ రవితేజ ‘రామారావు.. ఆన్ డ్యూటీ’ పిక్చర్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. కానీ, వేణు తొట్టెంపూడి తన పాత్ర పరిధి మేరకు చక్కటి నటన కనబర్చారని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కాగా, వేణు తొట్టెంపూడి ఓ ఇంటర్వ్యూలో తను నటించిన ‘హనుమాన్ జంక్షన్’ విజయాలు, ఆనాటి సంగతులు షేర్ చేసుకున్నారు.
‘హనుమాన్ జంక్షన్’ సినిమా చేసినందుకు తను ఇప్పటికీ హ్యాపీగా ఫీలవుతానని చెప్పారు. తనకు అప్పట్లో ఈ సినిమా చేసినందుకు చాలా మంది ప్రముఖులు ప్రశంసించారని చెప్పారు. ఓ కార్యక్రమంలో తనను కలిసి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హనుమాన్ జంక్షన్’ పిక్చర్ గురించి ప్రస్తావించారని, తన నటన బాగుంటుందని చెప్పారని గుర్తు చేసుకున్నారు.
పవన్ కల్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్ లో ఉన్నారని, జనాలకు మంచి చేయడం కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని వేణు తొట్టెంపూడి చెప్పారు. ఎడిటర్ మోహన్ రాజా మీద ఉన్న నమ్మకంతో తాను ‘హనుమాన్ జంక్షన్’ చిత్రం చేశానని, అందులో యాక్షన్ కింగ్ అర్జున్, జగపతి బాబు తర్వాత మూడో హీరోగా నటించానని గుర్తు చేసుకున్నారు వేణు తొట్టెంపూడి.
ప్రస్తుతం ఓటీటీ సిరీస్ లతో పాటు ఓ సినిమాలో నటిస్తున్నట్లు వేణు తొట్టెంపూడి చెప్పుకొచ్చారు. ఇకపోతే అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ చాలా బాగుందని, తనకు ‘అతడు’ సినిమాలో సోనుసూద్ పాత్రను త్రివిక్రమ్ ఆపర్ చేశారని తెలిపారు. అయితే, తాను ఆ పాత్ర పోషించలేదని, తిరస్కరించానని వేణు తొట్టెంపూడి తెలిపారు.