కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో ఆందోళనలు చేలరేగిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పినిపె వివ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. అంతేకాకుండా పోలీసులపై రాళ్లు రువ్వారు. ఎస్పీ వాహనంపై కూడా రాళ్లదాడికి తెగబడ్డారు ఆందోళనకారులు.. అయితే.. ఈ ఘటన స్పందించిన హోంమంత్రి తానేటి వనిత.. ఈ ఆందోళనల వెనుక టీడీపీ, జనసేన పార్టీ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. దీంతో స్పందించిన జనసేనాని ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఎవరనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్న పవన్.. హోంమంత్రి ప్రకటనలో జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ లోపాలు, వైసీపీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండి అంటూ హోంమంత్రికి హితవు పలికారు పవన్.
అమలాపురంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. పాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడానికే సమస్యలను సృష్టిస్తున్నారని, పాలకుల వైఫల్యాలను పార్టీలకు ఆపాదిస్తున్నారని విమర్శించారు పవన్. అమలాపురం ఘటనను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని హితవు పలికారు. అంబేద్కర్ పేరును వివాదాలకు కేంద్రబిందువుగా మార్చడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మహనీయుడి పేరును వివాదాల్లోకి తెచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.