ప్రస్తుతం ఏపీలో రాజినామాల రాజకీయం రంజుగా మారింది. అసెంబ్లీని రద్దు చేసేసి మొత్తం ఎన్నికలకు వెళ్దామని బాబు చెబుతుంటే… అంత అవసరం లేదు.. ఉన్న 23మంది రాజినామా చేసి ఎన్నికలకు వెళ్లండి. మేము సిద్ధం అనేది వైకాపా సవాల్! వీరిమధ్య సవాళ్లూ, ప్రతి సవాళ్ల సంగతి అలా ఉంటే… వీరి మధ్యలో మైకందుకున్నారు పవన్!
అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, మధ్యలో అమరావతి చుట్టుపక్కల జిల్లాల్లో పవన్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి. ఈ క్రమంలో తనకు పోయిందేముందిలే అనుకున్నారో ఏమో కానీ… అటు టీడీపీ – ఇటు వైకాపా ఇరుపార్టీలనూ రాజినామాలు చేయండని డిమాండ్ చేస్తున్నారు పవన్. సరే రెండు చోట్ల పోటీ చేసినా ఒక్క చోట కూడా పవన్ గెలవకపోయినా.. అసెంబ్లీ లోపలకు అడుగుపెట్టలేకపోయినా.. తన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు… రాపాకా వరప్రసాద్! ఆయన కూడా రాజినామా చేస్తారా? పవన్ చేయమని చెబుతారా? పవన్ చెబితే రాపాక వింటారా?
రాజోలు నియోజకవర్గంలో రాపాక రాజినామా చేసినా వచ్చిన నష్టం ఏమీ లేదు? ఆయనకు మళ్లీ గెలిచే అవకాశాలు బాగానే ఉన్నాయి! ఆయన సొంత గ్రామం చింతలమోరి నుంచి మొదలు మలికీపురం, సఖినేటిపల్లి, గొంది, అంతర్వేది, చింతలపల్లి, రాజోలు, గుడిమెల్లంక, శివకోడు మొదలైన ప్రాంతాల్లో వరప్రసాద్ కి బలం బాగానే ఉంది. అదంతా పక్కన పెడితే… అసలు పార్టీ పెద్దగా పవన్.. రాపాకను అడగగలుగుతారా? అసలు అంత సీనే ఉంటే… ఇప్పటికే రాపాకతో రాజినామా చేయించి… అనంతరం టీడీపీ – వైకాపాలను డిమాండ్ చేసేవారనేది మరో మాట!
పవన్ మాట రాపాక వింటారా? ఇప్పుడు రాపాక ఏ పార్టీలో ఉన్నారన్న విషయం పవన్ కు క్లారిటీ లేదనే అనుకోవాలి. రాజీనామా చేయమని పవన్.. రాపాకను ఆదేశించలేరు సరికదా, కనీసం రిక్వెస్ట్ కూడా చేయలేని పరిస్థితి. మరి ఉన్న ఒక్క ఎమ్మెల్యే విషయంలో అలాంటి పరిస్థితి తెచ్చుకున్న పవన్… ఈ రెండు పార్టీలను రాజినామాలు చేయాలని డిమాండ్ చేస్తూ.. అమరావతి విషయాన్ని రాజ్కీయంగా క్యాష్ చేసుకోవాలని పడే తాపత్రయంలో నిజాయితీ ఎంత అనేది ఇప్పుడు ఏపీ వాసుల కొత్త ప్రశ్న!! ఈ ఒక్కసారైనా రాపాక.. పవన్ మాట వింటేనా?? అప్పుడు పవన్ రియల్ హీరోనే!!