జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో పెదరావూరుకు చేరారు. ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన రైతులు, మహిళలు, విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెదరావూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మార్పుకోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో తెలుగుదేశం, వైకాపా రెండు విఫలమయ్యాయని ఆరోపించారు.
‘‘ నాడు వైఎస్‌ను దూషించిన తెరాస నేతలే నేడు పొగడ్తలతో ముంచెత్తుతూ.. ఒకటవ్వడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. నేను పదవుల కోసం పాకులాడేవాడిని కాదు అలా అయితే…2014లోనే పదవి తీసుకునేవాడిని. నేను మార్పు కోసం వచ్చా. వ్యక్తులు వ్యవస్థలను నాశనం చేసినందుకు రాజకీయాల్లోకి వచ్చా. 25 కిలోల బియ్యం కాదు.. యువకులు 25 ఏళ్ల భవిష్యత్తు కోరుతున్నారు. పోరాటమే నాకు తెలిసిన విద్య.. పోరాటం చేస్తాం.. పోటీ చేస్తాం’’ అంటూ ఆవేశ పూరితంగా ఆయన ప్రసంగించారు.