జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతిలో వైయస్సార్ యంత్ర సేవా పథకం కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఏమాత్రం లేదని, వారికి కావాల్సింది అధికారమే అంటూ రోజా విమర్శించారు. పవన్ కళ్యాణ్ రీల్ హీరో మాత్రమేనని, ఆయన రియల్ హీరో కాదంటూ రోజా వ్యాఖ్యానించారు.
రెండున్నర గంటల సినిమాల్లో పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా కావచ్చు. కానీ నిజజీవితంలో పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే సీన్ లేదని రోజా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెబితే ఎవరైనా సీఎం కావచ్చు అంటూ వ్యాఖ్యానించారు. పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వచ్చినంత మాత్రాన వైసీపీని ఎవరూ ఏం చేయలేరని, ప్రజలంతా సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు అని రోజా అన్నారు.