సినిమా ఫంక్షన్స్ లో మెయిన్ క్యాండిడేట్ అందరికంటే ఆలస్యంగా ఆ కార్యక్రమానికి హాజరవ్వడం.. అంతా అయిపోయాక ఆఖరున ప్రసంగించడం జరుగుతుంటుంది. అసలైన వ్యక్తి ముందే మాట్లాడేస్తే తర్వాత ఎవరూ ఉండరు అన్నది వారి లాజిక్ అవ్వొచ్చు! కానీ… రాజకీయాల్లో అలాంటి లాజిక్కులు వాడితే బొమ్మ తిరగబడిపోద్దన్న విషయం తెలియకో ఏమో… అదే లాజిక్కుని రాజకీయాల్లో కూడా అప్లై చేస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్.
ఏదైనా విషయం జరగాల్సిన సమయానికి జరిగితేనే దాని లెక్క బాగుంటుంది! దొంగలుపడ్డ చాలా కాలం తర్వాత పనిచేస్తే ఫలితం ఏముంటుంది? ఈ విషయాలను మరిచిన పవన్ తాజాగా అమరావతి ఉద్యమంపై స్పందించారు. అవును… “అమరావతిలోనే రాజధాని” పోరాటం 200 రోజులు దాటిన సందర్భంగా స్పందించిన పవన్…రాజధాని రైతుల త్యాగాలు వృథా కానీవ్వం అంటూ మొదలుపెట్టి.. అమరావతి రైతుల పోరాటానికి తన సంఘీభావం ఎప్పుడూ ఉంటుంది.. రాజధాని కోసం రైతులు 34 వేల ఎకరాలు “త్యాగం” చేశారు.. రాజధాని మార్పుపై ఏకపక్ష నిర్ణయం రైతులను అవమానించడమే అని ముగించారు.
అసలు స్పందించకపోయినా… బాబు అనుంగ శిష్యుడు, బాబు అడుగుజాడల్లో నడుస్తున్నాడు అనే విమర్శలు అయినా తప్పేవి! ఇలా ఆలస్యంగా స్పందించడం వల్ల.. అనవసరంగా స్పందిచినట్లు సంకేతాలు వెళ్తున్నాయని జనసేనాని అభిమానులు ఈ సందర్భంగా ఫీలవుతున్నారంట.
కాగా.. గత శనివారం నాటికే రాజధాని ఉద్యమం 200 రోజులకు చేరిందంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా, కమ్యునిస్టు నాయకులమని చెప్పుకునే బాబు మిత్రులు కొందరు కలసి ద్విశత దినోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఏపీలో ఉన్న 13 జిల్లాల్లోనే ఉద్యమం కనిపించలేదనే కామెంట్లు వైకాపా నుంచి వస్తున్నా… తుళ్లూరు నుంచి వాషింగ్టన్ వరకూ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందంటూ కథనాలు వడ్డించేశారు!