ఇప్పటివరకు జనసేన బలోపేతానికి పవన్ కల్యాణ్ పెద్దగా వర్కౌట్ చేసిన విషయాలు ఏమి లేవు. ఏదో అప్పుడప్పుడు వైసీపీపై పోరాటాలు చేయడం..ప్రజా సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేయడం తప్ప…ప్రత్యేకంగా జనసేన బలోపేతానికి మాత్రం పవన్ పెద్దగా కృషి చేసినట్లు ఎక్కడ కనిపించలేదు. సినిమాలు చేసుకోవడం, అప్పుడప్పుడు వచ్చి సమస్యలపై పోరాటం చేయడం. ఇదే పవన్ రాజకీయం.
ఇలా చేయడం వల్ల జనసేన బలం పెద్దగా పెరిగినట్లు కనిపించడం లేదు. ఏదో ఒకటి, రెండు శాతం ఓట్లు తప్ప..జనసేనకు ఒరిగింది ఏమి లేదు. అసలు జనసేన బలపడాలంటే అన్నీ స్థానాల్లో బలమైన నాయకులు ఉండాలి..వారు ఇంకా బలంగా పనిచేయాలి. అసలు 175 స్థానాల్లోనే జనసేనకు బలమైన నాయకులు లేరు. ఏదో ఉన్నవారు కూడా పూర్తి స్థాయిలో బలపడే కార్యక్రమాలు చేయడం లేదు. ఏదో గోదావరి, కృష్ణా జిల్లాల నేతలు కొందరు తప్ప…మిగిలిన నాయకులు ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఆ జిల్లాల నేతలు కూడా పనిచేయడానికి కారణం..ఆయా జిల్లాల్లో జనసేన కాస్త బలంగా ఉండటం.
అదే సమయంలో టీడీపీతో పొత్తు ఉంటే ఎలాగోలా గెలిచేస్తామని కొందరు నేతలు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ పరిణామాలు జనసేన సొంతంగా ఎదగడానికి ఉపయోగ పడటం లేదు. అలా అని పవన్ కూడా ప్రత్యేకంగా బలోపేతానికి చేసే కార్యక్రమాలు లేవు. పార్టీ బలపడాలంటే సొంతంగా బలమైన నాయకులని తయారు చేయడమే కాదు..ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలని లాగాలి. పవన్ ఇప్పటివరకు ఆ పనిచేయలేదు.
కానీ ఇటీవల పవన్ లో మార్పు కనిపిస్తోంది…ఆ దిశగానే పవన్ ముందుకెళ్లెలా ఉన్నారు..ఇప్పటికే రాజోలులో వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావుని జనసేనలోకి తీసుకొచ్చారు. అలాగే అక్టోబర్ 5 నుంచి పవన్ బస్సు యాత్ర చేయనున్నారు. ఈ యాత్రలో వైసీపీ-టీడీపీల నుంచి పలువురు నాయకులని జనసేనలోకి లాగే ఛాన్స్ కనబడుతోంది. అది కూడా ఆ రెండు పార్టీల్లో సీట్లు దక్కే ఛాన్స్ లేని వారిని జనసేనలోకి తీసుకొస్తారని తెలుస్తోంది. మరి ఇకనైనా జనసేన బలపడుతుందేమో చూడాలి.