కోవిడ్‌ వేళ పేటీఎం ఊరట!

-

ఆక్సిజన్‌ అందకపోవడంతో కరోనా పేషంట్లు పిట్లల్లా రాలిపోతున్నారు. ఈ దయనీయ పరిస్థితుల్లో రోగులను ఆదుకునేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. అదే దారిలో ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ పేటీఎం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ చెల్లింపులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ట్సాన్సాక్షన్‌ ఫీజులను మాఫీ చేసింది. రూ.10 లక్షల ట్రాన్సాక్షన్‌ వరకు ఈ ఫీజు మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది.

దాతల నుంచి అన్ని రకాల డిజిటల్‌ చెల్లింపులను అంగీకరించడంతో పాటు, వెంటనే వాటిని ఆయా ఎన్జీఓ ఖాతాల్లో జమచేస్తామని పేటీఎం తెలిపింది. కేవలం ఒక్క రోజులోనే ఈ డబ్బును సదరు ఎన్‌జీఓ ఖాతాల్లో జమచేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ సమయంలో రోగులకు ఆహారం, మెడిసిన్‌, ఆక్సిజన్‌ సిలిండర్లను అందిస్తూ నిరంతరంగా పనిచేస్తున్న ఎన్జీఓలకు తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేటీఎం ప్రతినిధి వెల్లడించారు. పేటీఎం ద్వారా పౌరులు అందించే కాంట్రిబ్యూషన్‌ను స్వీకరించడానికి ఇది వరకు రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టేది. దీన్ని ఇప్పుడు ఒక రోజుకు కుదించింది. కొన్ని వారాలుగా, పేటీఎం పేమెంట్‌ గేట్‌వేలో రిజిస్టర్‌ చేసుకున్న ఎన్జీఓలకు విరాళాలు 400 శాతం పెరగడం గమనార్హం.

ఈ నిర్ణయంపై పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ, ‘ఎన్జీఓలు ఎల్లప్పుడూ సహాయ కార్యక్రమాల్లో ముందుంటాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆహారం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సాయాన్ని అందించడంలో ఎన్‌జీఓలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల వారి సంకల్పానికి తోడుగా మేము కూడా వారితో కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించింది. ప్రజలు లేదా సంస్థల నుంచి అందుకునే విరాళాలను ఆయా ఎన్‌జీఓలుకు వేగంగా ప్రాసెస్‌ చేయడానికి మా వంతు సాయం చేస్తున్నాం. కరోనా రోగులకు సాయం చేస్తున్న ఎన్జీఓలకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం’’ అని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొంటున్నందున పేటీఎం ఫౌండేషన్‌ 12 –13 నగరాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version