మరోసిర వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరదీసిందని ఆరోపించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పేరిట రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చారని వెల్లడించారు. ప్రాజెక్టులకు ఎలక్ట్రో మెకానికల్ పనుల కోసమని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అప్పులు తెచ్చిందని పయ్యావుల కేశవ్ తెలిపారు.
అయితే ఆ అప్పులో రూ.900 కోట్లు నేరుగా ప్రైవేటు కాంట్రాక్టర్ కు చెల్లించారని పయ్యావుల వివరించారు. ఓ కార్పొరేషన్ అప్పు చేసినప్పుడు నిధులు ఆ కార్పొరేషన్ ఖాతాలోకే రావాలని, అలాకాకుండా, నేరుగా కాంట్రాక్టర్లకు చెల్లించే కొత్త విధానాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టిందని పయ్యావుల కేశవ్ దుయ్యబట్టారు.
దీని ద్వారా, రేపు ఎవరు ఎక్కడ అప్పులు చేస్తారు? ఎవరి అకౌంట్లోకి ఆ డబ్బు వెళుతుందన్నది తెలిసే అవకాశం లేదని పయ్యావుల విమర్శించారు పయ్యావుల కేశవ్. కానీ, అప్పులు తీర్చేటప్పుడు మాత్రం ప్రభుత్వ ఖజానాలో ప్రజల డబ్బు నుంచే చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు మొదలయ్యాయని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.