సొంత జిల్లాలో ఆ మంత్రికి సెగ‌.. నేత‌ల నుంచి కాదు.. ప్ర‌జ‌ల నుంచే..!

-

సాధార‌ణంగా ఒక జిల్లా నుంచి ఒక నాయ‌కుడు మంత్రి అయ్యారంటే.. ఆయ‌న‌పై స‌హ‌జంగానే జిల్లా ప్ర‌జ‌లు చాలా ఆశ‌లు పెట్టుకుంటారు. ఎప్ప‌టి నుంచో స్త‌బ్దుగా ఉన్న ప‌నులు కూడా పూర్త‌వుతాయ‌ని భావిస్తారు. ఇక‌, రైతులు కూడా ఇదే త‌ర‌హా ఆశ‌లు పెట్టుకుంటారు. త‌మ‌కు సాగు నీరు అందుతుంద‌ని, క‌ష్టాలు తెలిసిన స్థానిక నాయ‌కుడు మంత్రి అయ్యాడు కాబ‌ట్టి.. ఇక‌, త‌మ‌కు ఇబ్బందులు త‌గ్గుతాయ‌ని వారు భావిస్తారు. అయితే, దీనికి భిన్నంగా స‌ద‌రు మంత్రి అయిన నాయ‌కుడు వ్య‌వ‌హ‌రిస్తే ఏం జ‌రుగుతుంది?  ప్ర‌జ‌లు ఎలా రియాక్ట్ అవుతారు? అనే విష‌యాలు తెలియాలంటే.. అనంత‌పురం వెళ్లాల్సిందే.

అనంత‌పురం జిల్లా పెనుకొండ నియోజ‌వ‌క‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కిన మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ ప్ర‌స్తుతం రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న‌పై స్థానికంగా ప్ర‌జ‌లు చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. త‌మ‌కు ప‌నులు చేసి పెడ‌తార‌ని, ముఖ్యంగా నీటి స‌మ‌స్య‌తో అల్లాడుతున్న జిల్లాలో ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటార‌ని అనుకున్నారు. అయితే, ఆయ‌న మంత్రి అయి ఏడాదిన్నర అయిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలోని నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక పోయారు.

అత్యంత కీల‌క‌మైన హంద్రీనీవా జ‌లాల‌ను ఆయ‌న అనంత‌కు పారించ‌లేక పోయారు. వాస్త‌వానికి హంద్రీ నీవా అనేది కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న స‌మస్య‌. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఎన్నిక‌ల నినాదంగా హంద్రీనీవా నిలుస్తుంది. దీంతో గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో హంద్రీనీవా జలాల‌తో నియోజ‌క‌వ‌ర్గాన్ని పునీతం చేస్తాన‌ని.. శంక‌ర‌నారాయ‌ణ శ‌ప‌థం చేశారు. అయితే, దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కుచ‌ర్య‌లు తీసుకోలేక పోయారు. ఈ ప‌రిణామాల‌నే ఇక్క‌డి ప్ర‌జ‌లు, రైతులు ప్ర‌శ్నిస్తున్నారు.

క‌నీసం మ‌డ‌క‌శిర చెరువుల‌కైనా నీరివ్వాల‌ని రైతులు కోరుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ ఎలాంటి ప‌రిష్కారం చూపించ‌డంలో మంత్రి చొర‌వ చూపించ‌లేక పోవ‌డంపై రైతులు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల మంత్రి ఇక్క‌డ ప‌ర్య‌ట‌న నిర్వ‌హించిన‌ప్పుడు కూడా రైతులు ఆయ‌న కాన్వాయ్‌కు అడ్డుప‌డి ఆందోళ‌నకు దిగారు. మ‌రి ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. మున్ముందు క‌ష్ట‌మ‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version