ఆలేరులో గొంగిడి సునీతకు నిరసన సెగ

-

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. గ్రామాల్లోకి రానివ్వకుండా నిరసన తెలుపుతున్నారు. లేటెస్ట్ గా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మేల్యే గొంగిడి సునీతకు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి, సర్వేపల్లి, తిమ్మాపురం గ్రామాల్లో ప్రచారం ముగించుకుని మొరిపిరాల గ్రామంలోకి వెళ్లగా.. దళితబందులో తమకు అన్యాయం చేశారని గ్రామస్తులు ఎమ్మెల్యే సునీత ప్రచార రథాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు.

దళిత బంధు విషయంలో తమ కుటుంబాలకు అన్యాయం చేశారని, సర్పంచ్ దళిత బంధు లబ్ధిదారులు ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు వసూలు చేశారని, పేరుకు తమను లబ్ధిదారులుగా ఎంపిక చేసినప్పటికీ అన్యాయం జరిగిందని నిలదీశారు. దీంతో టిఆర్ఎస్ నాయకులు, గ్రామస్తుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, గ్రామ సర్పంచ్ మీరేమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా.. అందరూ దొంగలే అని రుసరుసలాడారు. మొన్న కూడా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని మైలారం గ్రామంలో శనివారం గొంగిడి సునీత మహేందర్రెడ్డికి నిరసన సెగ తగిలింది. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, దళిత, బీసీ బంధు వంటివి తమకు రాలేదంటూ ప్రచారాన్ని అడ్డుకొని గ్రామ ప్రజలు వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version