రాష్ట్రంలో కొలువుదీరిన ప్రజాప్రభుత్వంపై రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. పరేడ్ గ్రేండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు.ప్రజా ప్రభుత్వం సంక్షేమానికి, సంస్కృతికి పెద్దపీట వేస్తోందని అన్నారు. అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారని, వ్యవసాయాన్ని రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నముకగా మార్చినట్లు పేర్కొన్నారు. 25 లక్షల మందికిపైగా రైతుల రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు.
రైతులకు రైతుభరోసా అందిస్తోందని, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సన్నరకం బియ్యానికి బోనస్ అందించామని, 2024 వర్షాకాలంలో 1.59 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసినట్లు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు రవాణాతో రూ.4,500 కోట్లు ఆదా చేశామన్నారు. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి అందిస్తున్నట్లు వెల్లడించారు.