రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఫిర్యాదుల అన్నిటినీ ఒక్కచోట నమోదు చేస్తున్నామని సీఎం చంద్రబాబు కలెక్టర్లతో జరిగిన సమావేశంలో తెలిపారు. గడిచిన ఆరు నెలలుగా ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు ప్రజల నుంచి వచ్చాయన్నారు. 78,700 ఫిర్యాదులు రెవెన్యూ విభాగం నుంచే వచ్చాయని, 14 వేల 119 ఫిర్యాదులు పోలీసు విభాగానికి చెందినవని, 13,146 మున్సిపల్ శాఖలో ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. అన్ని విభాగాలు దాదాపు 70 శాతం వరకు ఫిర్యాదులు పరిష్కరించినట్టు చూపుతున్నాయన్నారు.
ప్రజల నుంచి సంతృప్తి స్థాయి ప్రతి నెలా తగ్గుతూ వస్తోందంటే ప్రజలకు సరైన పరిష్కారం చూపించటం లేదని అర్ధం అవుతోందని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. వారిలో అసంతృప్తి ఎక్కువ అయితే ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తుందన్నారు. కొన్ని ఫిర్యాదులు పరిష్కరించలేనివి కూడా వస్తున్నాయని, ప్రజలకు సమాధానం చెప్పేటప్పుడు నిర్లక్ష్య ధోరణి ఉండకూడదని తెలిపారు. చాలా సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలని అందరికీ సూచిస్తునన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత ఉండాలి అదే ప్రామాణికంగా పని చేయాలన్నారు. ఆర్ధిక, ఆర్థికేతర అంశాలుగా వాటిని వేరు చేసి వీలైనంత మేర పరిష్కరించాలని సూచించారు.