కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో కలకలం చెలరేగింది. ఆ కార్యాలయ సిబ్బందిపై కనకయ్య అనే రైతు పెట్రోల్ చల్లాడు. సీనియర్ అసిస్టెంట్ రామచందర్, వీఆర్వో అనిత, కంప్యూటర్ ఆపరేటర్ జగదీశ్, అటెండర్ దివ్యపై పెట్రోల్ పడింది. ఆ కార్యాలయ సిబ్బంది భూమి పట్టా మంజూరు చేయట్లేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్.. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లారు.
కనకయ్యపై పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంతో ఉలిక్కిపడ్డ రెవెన్యూ శాఖలో ఇటువంటి మరో ఘటన జరగడం విస్మయానికి గురి చేస్తోంది.