నిర్మాణంలో ఉన్న నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న స్టోర్ రూమ్ లో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మంటలను గమనించిన సిబ్బంది మంటలని ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటల తీవ్రత పెరగడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి చేరుకునే లోపే ఆ మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు చేరుకున్నాయి. స్టోర్ రూమ్ లో ఉన్న ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మంటల్లో కాలిపోయాయి. 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై హైకోర్టులో పిల్ దాఖలు అయింది.
సెక్రటేరియట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై సీబీఐతో విచారణ జరపాలని కోరారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్. తాను దాఖలు చేసిన పిల్స్ ను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని చీఫ్ జస్టిస్ బెంచ్ కి పాల్ తెలిపారు. కేఏ పాల్ దాఖలు చేసిన పిల్ కు నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్టర్ కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేఏ పాల్ వేసిన పిల్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.