దేశంలోనే తొలిసారిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా రోగుల కోసం కొత్తగా ఓ ప్లాస్మా బ్యాంక్‌నే ప్రారంభించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ బ్యాంక్‌ను ప్రారంభించారు. కోవిడ్ 19 అత్యవసర స్థితి ఉంది, ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న రోగులకు ప్లాస్మా థెరపీ ఎంతో ఉపయోగపడుతుందన్న సంగతి తెలిసిందే. కోవిడ్ మరణాలను తగ్గించేందుకు ఈ థెరపీ పనికొస్తుంది. అందుకనే ఈ బ్యాంక్‌ను ప్రారంభించామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను ఈ బ్యాంక్‌కు దానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇక ప్లాస్మాను దానం చేసేవారికి ఆయన 5 ముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నారు.
1. వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండి, 50 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉన్న వారు కోవిడ్ పేషెంట్ల కోసం తమ ప్లాస్మాను దానం చేయవచ్చు.
2. ఢిల్లీవాసులు ప్లాస్మాను దానం చేయదలచుకుంటే 1031 నంబర్‌కు కాల్ చేయవచ్చు. లేదా 8800007722 నంబర్‌కు వాట్సాప్ చేయవచ్చు. దీంతో వైద్యులు వారితో టచ్‌లో ఉండి వారి నుంచి ప్లాస్మాను తీసుకుంటారు.
3. కరోనా బారి నుంచి కోలుకుని 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, 50 కేజీల కన్నా బరువు ఎక్కువ ఉన్నవారు ప్లాస్మాను దానం చేయవచ్చు. అయితే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు ప్లాస్మాను దానం చేయకూడదు.
4. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ ప్లాస్మా బ్యాంక్ నడుస్తుంది. దాతలు సిద్ధంగా ఉంటే వారు ప్లాస్మాను దానం చేసేందుకు అర్హులో, కాదో వైద్య సిబ్బంది నిర్ణయించి.. దాని ప్రకారం ప్లాస్మాను తీసుకుంటారు.
5. ప్లాస్మాను దానం చేసే వారి కోసం ఢిల్లీ ప్రభుత్వం ఉచితంగా రవాణా సదుపాయం కూడా అందిస్తోంది. కోవిడ్ 19 రోగులకు చెందిన బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ప్లాస్మాను దానం చేయవచ్చు.