గుంటూరు జిల్లాలో ఒక మహిళా ఎమ్మెల్యే చుట్టూ వివాదాలు మళ్లీ రేగుతున్నాయి. ఒకప్పుడు పేకాట వ్యవహారంలో సీరియస్‌గా ఉన్న ఆమె.. ముఖ్య అనుచరులను పార్టీ నుంచి సాగనంపారు. ఈ చర్యలతో అప్పట్లో సమస్యకు చెక్ పెట్టారని అంతా అనుకున్నారు. కానీ.. ఆ చర్యల ప్రకంపనలు ఇప్పుడు కనిపిస్తున్నాయట. ఆనాటి వివాదం ముదురి పాకాన పడుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అప్పట్లో వేటు పడ్డ ముఖ్య అనుచరులు ఇప్పుడు ఎమ్మెల్యే లక్ష్యంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. ముచ్చటగా మూడు ప్రశ్నలు వేస్తూ.. కమింగ్ సూన్ అంటూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నారు. పేకాట ఆడించమని సలహా ఇచ్చింది ఎవరు? ఆట ఆడించిన ప్రజాప్రతినిధి ఎవరు? పేకాట ఎపిసోడ్‌లో బలైంది ఎవరు? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఈ పోస్టులు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అతి త్వరలోనే పూర్తి ఆధారాలతో మీడియా ద్వారా ప్రజలకు ముందుకు వస్తామని వారు చెప్పడం చూస్తుంటే.. వారేం వెల్లడిస్తారా అన్న ఆసక్తి పెరుగుతోంది.
రెయిన్ ట్రీ పార్క్ కేంద్రంగా సాగిన పేకాట వ్యవహారంలో ఎమ్మెల్యే అనుచరులు ఉండటంతో అప్పట్లో దుమారం రేగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో అంతకు మించిన హడావిడి నెలకొంది. పేకాట గొడవలో బలైంది ఎవరు? ఎందుకు బలైపోయారు? ఆడింది ఎవరు? ఆడించింది ఎవరు? అన్న ప్రశ్నలపై ఒకరి నొకరు చర్చించుకుంటున్నారు. సదరు ఎమ్మెల్యేతో పేకాటకు సంబంధించిన అంశాలపై చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడారట సదరు అనుచరులు. ఆ ఫోన్ సంభాషణలనే ఇప్పుడు బయటపెట్టొచ్చని ప్రచారం జరుగుతోంది.