మూడు రోజుల క్రితం (నవంబర్ 15)న గిరిజన దినోత్సవం సందర్భంగా భోపాల్ లోని హబిబ్‌గంజ్ రైల్వేస్టేషన్‌ను ‘రాణి కమలాపతి స్టేషన్’గా పేరు మార్చారు. అప్పటినుంచి అందరికి వచ్చిన డౌట్.. రాణి కమలాపతి ఎవరు అని. దేశంలో చాలా మంది ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపూర్వ సౌందర్యవతి అయిన గోండు రాణిగా రాణి కమలాపతి చరిత్రలో నిలిచి ఉంది.
భోపాల్ లో రాణి కమలాపతి గురించి అనేక కథలు వినిపిస్తాయి. భోపాల్‌లో భిల్లుల తర్వాత గోండులే అత్యధిక గిరిజన జనాభా ఉండేవారు. దేశంలో గోండులు దాదాపు కోటీ ఇరవై లక్షల మంది ఉన్నారని అంచనాలు చెబుతున్నాయి. వారి సంస్కృతి, వారి కథా నాయకులు, వారిలో జన్మించిన ధీర వనితలు కొందరూ మాత్రమే వెలుగులోకి వస్తున్నా ఇటీవల కాలంలో రాజకీయ కారణాల రీత్యా కూడా కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. అలా రాణి కమలాపతి ఇప్పుడు దేశానికి కుతూహలం కలిగిస్తోంది. దానికి కారణం మొన్నటి ‘ఆదివాసీ గౌరవ దినోత్సవం’ సందర్భంగా భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అక్కడి హబిబ్‌గంజ్ రైల్వేస్టేషన్‌కు ‘రాణి కమలాపతి’ పేరును పెట్టడమే. ఇంతకీ ఈమె ఎవరంటే..
18వ శతాబ్దంలో భోపాల్ ప్రాంతం గోండుల రాజ్యం. నిజాం షా అనే గోండు రాజు సెహోర్ జిల్లాలోని గిన్నోర్ ఘర్ కోట నుంచి ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతనికి 7 మంది భార్యలని కొందరూ.. కాదు ముగ్గురు భార్యలని మరికొందరూ చెప్పుకునే వారు. వారిలో ఒక భార్య రాణి కమలాపతి. కమలావతికి అపభ్రంశం ఈ పేరు. కమలాపతి అపూర్వ సౌందర్యరాశి. ఆమె సౌందర్యానికి ఆరాధకుడైన నిజాం షా ఆమె కోసం భోపాల్‌లో ఒక 7 అంతస్తుల కోట కట్టించాడని ఒక కథనం. ఆ కోట ఇప్పుడు భోపాల్‌లో ఉంది. 5 అంతస్తులు నీట మునిగి రెండు పైకి కనిపిస్తూ ఉంటాయని అక్కడివారు అంటుంటారు. హైలెట్ ఏంటంటే.. ఈ కోటలో ఇంకా కమలాపతి ఆత్మ తిరుగుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారట.
గోండు రాజ్యం మీద, కమలాపతి మీద కన్నేసిన మరిది వరసయ్యే చైన్ సింగ్ అనే వ్యక్తి నిజాం షాకు విషం పెట్టి చంపుతాడు. అతడు తనను లోబరుచుకుంటాడని భావించిన కమలాపతి పసిబిడ్డైన తన కుమారుడు నావెల్ షాను తీసుకొని మారు పేరుతో కోటను విడిచి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు ఆమె గోండులకు విశ్వాస పాత్రుడైన యుద్ధవీరుడు మహమ్మద్ ఖాన్‌ను కలిసింది. తన భర్త హంతకుడైన చైన్ సింగ్‌ను చంపమని ఆమె కోరిందని, అందుకు వెయ్యి రూపాయల సుపారీ ఇచ్చిందని ఒక కథనం. ఆ సుపారీ ధనంలో కూడా ఒక వంతే చెల్లించి మిగిలిన దానికి భోపాల్‌లోని కొంత భాగం ఇవ్వజూపిందని అంటుంటారు. మరో కథనంలో ఆమెకు సంబంధం లేకుండానే ఆమె బాధను చూసి మహమ్మద్ ఖానే స్వయంగా గిన్నోర్‌ఘర్ కోట మీద దాడి చేసి చైన్ సింగ్‌ను హతమారుస్తాడు.
మహమ్మద్ ఖాన్ కమలాపతిని సొంతం చేసుకోవాలని ఆశించాడు. ఈ సంగతి తెలిసిన కమలాపతి కుమారుడు 14 ఏళ్ల నావల్ షా.. ఆగ్రహంతో మహమ్మద్ ఖాన్ మీద యుద్ధానికి దిగుతాడు. ‘లాల్‌ఘాటీ’ అనే ప్రాంతంలో జరిగిన ఆ యుద్ధంలో కుమారుడు మరణిస్తాడు. కమలాపతి వర్గీయులు ఆ వెంటనే లాల్‌ఘాటీ నుంచి నల్లటి పొగను వదులుతారు.
మహల్ నుంచి ఆ పొగను చూసిన కమలాపతి తాము అపజయం పొందినట్టు గ్రహించి మహల్ ఒడ్డున ఉన్న సరస్సు గట్టును తెంపిచింది.. నీళ్లు మహల్‌ను ముంచెత్తాయి. కమలాపతి తన నగలు సర్వస్వం నదిలో వేసి జల సమాధి అయ్యింది. 1722లో ఆమె మరణం తర్వాత అక్కడి గోండు రాజ్యం పూర్తిగా అంతరించింది.
గోండు రాణి కమలాపతి జీవితం సాహసంతో, ఆత్మాభిమానంతో, ఆత్మబలిదానంతో నిండినది. అందుకనే ఆమెను మధ్యప్రదేశ్‌లోనూ గోండులు అధికంగా ఉన్న రాష్ట్రాలలో అభిమానంగా తలుస్తారు. ఇప్పుడు ఆమె పేరు ఒక పెద్ద రైల్వే స్టేషన్‌కు పెట్టడం భావితరాలకు ఆమె గురించి తెలియాలనే ఆమె స్పూర్తిని ఇవ్వాలని ఆశించి చేసిన ప్రయత్నం.