ప్రజాస్వామ్య దేశాలకు భారత్ మార్గదర్శిగా నిలిచిందని స్పష్టం చేశారు. మహాత్మునికి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. దేశప్రగతిని పరుగులు పెట్టించేందుకు ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం ప్రజల ఆశలు సాకారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రతిక్షణం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఆసన్నమైందన్నారు. మన ముందున్న బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత ప్రజానీకం నవచేతనతో మందడుగు వేస్తున్నది. వచ్చే 25 ఏండ్లు పంచ ప్రాణాలుగా భావించి అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుల ఆకాంక్షలను సాకారం చేయాలన్నారు. సంపూర్ణ అభివృద్ధి మనముందున్న అతిపెద్ద సవాలని చెప్పారు. మనలో ఏ మూలన దాగివున్న బానిస మనస్తత్వాన్ని వదిలేయాని సూచించారు. సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలని ప్రధాని వెల్లడించారు. రాజకీయ సుస్థిరత వల్ల ప్రయోజనాలను ప్రపంచానికి భారత్ చూపిందని తెలిపారు.
రాజకీయ సుస్థిరత వల్ల అభివృద్ధిలో వేగం, నిర్ణయాధికారంలో దేశం శక్తిమంతమవుతుందని చెప్పారు. రాజకీయ సుస్థిరత దేశ గౌరవ మర్యాదలను పెంచుతుందని ప్రధాని మోదీ అన్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు భారత్ నిలబడలేదని, ముక్కలు చెక్కలవుతుందని చాలామంది అన్నారని ప్రధానిమోదీ చెప్పారు. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచిందన్నారు. ప్రపంచ యవనికపై తనదైన ముద్రవేసిందని, సమస్యలకు ఎదురొడ్డి నిలిచిందన్నారు. ఆకలికేకల భారతావని నేడు ఆహార ధాన్యాల ఎగుమతి స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. వైజ్ఞానిక రంగంలో ఇండియా తన ముద్ర వేస్తున్నదని చెప్పారు.