బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ లో పర్యటిస్తున్నారు. ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ లో స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. షేక్‌హసీనా.. నరేంద్ర మోదీ సమక్షంలో ఇరుదేశాల అధికారులు ఏడు ఎంఓయూలపై సంతకాలు చేశారు. భారత్, బంగ్లాదేశ్ స్నేహం పరస్పర సహకార స్ఫూర్తితో చాలా సమస్యలు పరిష్కరించుకున్నాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
”రానున్న 25 ఏళ్ల అమృత కాలంలో భారత్, బంగ్లాదేశ్ మైత్రి బంధం సరికొత్త శిఖరాలకు చేరుతుందన్న నమ్మకం నాకుంది. బంగ్లాదేశ్.. భారత్‌కు అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి. ఈ ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా. ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సహకారంలోనూ నిరంతర అభివృద్ధి ఉంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం వేగంగా వృద్ధి చెందుతోంది. ఐటీ, అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో సహకారం అందించాలని నిర్ణయించాం. విద్యుత్ ప్రసార మార్గాలపై కూడా భారత్, బంగ్లాదేశ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. భారత్-బంగ్లా గుండా 54 నదులు ప్రవహిస్తున్నాయి. కుషియారా నది నీటి భాగస్వామ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేశాం.” అని మోదీ అన్నారు.