కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఇవాళ ప్రారంభమైంది. ప్రధాని మోడీ ఈ పథకాన్నిఇవాళ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన మోడీ పలువురు రైతులకు ఈ సందర్భంగా చెక్కులను అందజేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడికి కావల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని మోడీ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని పొందాలంటే.. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు అయి ఉండాలి. ఒక కుటుంబంలో ఒకే పాస్‌బుక్ ఉండాలి. అలాంటి రైతులకు విడతకు రూ.2వేల చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ.6వేలను వారి ఖాతాల్లో జమ చేస్తారు. కాగా ఈ పథకం కింద 1 కోటి మంది రైతులు లబ్ది పొందనున్నారు. మొదటగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పథకం ప్రారంభం కాగా, త్వరలోనే మిగిలిన రా్ష్ట్రాల్లోని రైతులకు ఈ పథకాన్ని అందుబాటులోకి తేనున్నారు.
కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద తెలంగాణలో తొలి విడత పెట్టుబడి కింద మొత్తం 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ చేయనున్నారు. ఇప్పటికే 5 లక్షల మంది రైతులకు గాను నిధుల విడుదలకు సంబంధించి టోకెన్లు ఇచ్చారని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో విడతల వారీగా రైతులందరి అకౌంట్లలో రూ.2వేలు జమ కానున్నాయి.