వ్య‌వ‌సాయ మౌలిక వ‌స‌తుల‌కు రూ.1 ల‌క్ష కోట్లు విడుద‌ల చేయ‌నున్న మోదీ..!

-

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశంలో వ్య‌వ‌సాయ రంగానికి కావల్సిన మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు గాను రూ.1 ల‌క్ష కోట్ల నిధుల‌ను మంజూరు చేయ‌నున్నారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ నిధుల‌ను విడుద‌ల చేస్తారు. అలాగే పీఎం కిసాన్ స్కీం కింద దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల‌కు 6వ విడ‌తగా రూ.17వేల కోట్ల‌ను కూడా ఆయ‌న విడుద‌ల చేస్తారు. ఈ మేర‌కు శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ప్ర‌ధాని మోదీ విడుద‌ల చేయ‌నున్న రూ.1 ల‌క్ష కోట్ల నిధుల ద్వారా దేశంలోని ప‌లు ప్రాంతాల్లో వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు కావ‌ల్సిన మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు వీలు క‌లుగుతుంది. రైతుల పంట‌ల‌ను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్‌లు, ఇత‌ర స‌దుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్ల‌ను ఏర్పాటు చేస్తారు. దీని వ‌ల్ల రైతుల పంట‌ల‌కు ఎక్కువ లాభం వ‌స్తుంది. అలాగే రైతులు త‌మ పంట‌ల‌ను ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకుని ఎలాంటి న‌ష్టం లేకుండా అమ్ముకోవ‌చ్చు. ఆయా స‌దుపాయాల నిర్మాణానికి గాను అవ‌సర‌మైన రుణాల‌ను అందించేందుకే స‌ద‌రు రూ.1 ల‌క్ష కోట్ల‌ను వినియోగిస్తారు.

అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇన్‌ఫ్ట్రాస్ట్ర‌క్చ‌ర్ ఫండ్ కింద ఆ నిధుల‌ను మోదీ విడుద‌ల చేస్తారు. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ కూడా వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అలాగే దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version