వాయనాడ్ లో జరిగిన ప్రకృతి విపత్తు గురించి అందరికి తెలిసిందే. వందలమంది ఈ ఘటనలో చనిపోయారు. ఈ క్రమంలోనే అక్కడ సహాయ మరియు పునరావాస చర్యలను సమీక్షించేందుకు రేపు వాయనాడ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కన్నూర్ చేరుకోనున్నారు ప్రధాని.
వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్న ప్రధాని.. 12:15 PM ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడ ప్రధానికి రెస్క్యూ ఫోర్స్ ద్వారా తరలింపు ప్రయత్నాల గురించి వివరిస్తారు అధికారులు. అలాగే అక్కడ జరుగుతున్న పునరావాస పనులను ఆయన పర్యవేక్షిస్తారు. సహాయ శిబిరం మరియు ఆసుపత్రిని కూడా సందర్శిస్తారు. అక్కడ కొండచరియలు విరిగిపడిన బాధితులు మరియు ప్రాణాలతో బయటపడిన వారిని కలిసి వారితో మాట్లాడతారు ప్రధాని. ఆ తర్వాత ప్రధానమంత్రి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అక్కడ జరిగిన సంఘటన మరియు కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ఆయనకు వివరంగా తెలియజేస్తారు.