ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు చేరుకోనున్న ప్రధానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్ సహా.. రాష్ట్రప్రభుత్వం తరఫున తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు.
బేగంపేట విమానాశ్రయం ప్రాంగణంలోనే ప్రధాని స్వాగత సభకు ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రత్యేక వేదిక నుంచి బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రధాని పర్యటన, బేగంపేటలో స్వాగత సభ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
భద్రాచలం రోడ్, సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. అనంతరం ఎన్టీపీసీలోని పీటీఎస్ మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ ఏర్పాట్లను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి భగవంత్ కూబా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు. ‘రైతునే రాజు’ చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్రప్రభుత్వం పని చేస్తుందని బండి సంజయ్ అన్నారు.