కరోనా వైరస్ దెబ్బకు హడలుతున్న పోలీసులు.. డ్రంకెన్ డ్రైవ్ లు బంద్..!

-

నెల కిందట చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించింది. ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో, ఇంకెంతమంది దీని బారిన పడతారో అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య గంటగంటకూ పెరిగిపోతోంది. చైనాతోపాటు ప్రపంచ దేశా లను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఉద్దృతి క్రమంగా పెరుగుతున్నది. ఇక ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ట్రాఫిక్ పోలీసులు హడలిపోతున్నారు. వారాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, మందు బాబుల ఆటకట్టించే పోలీసులకు, ఇప్పుడు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు వద్దని ఆదేశాలు అందాయి.

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆల్కోమీటర్ ద్వారా మద్యం పరీక్షలు చేయవద్దని ట్రాఫిక్ పోలీస్ హెడ్ రవికాంతే గౌడ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అనేక మంది ఒకే ఆల్కో మీటర్ ద్వారా గాలిని ఊదడం వల్ల, ఎవరికైనా కరోనా వైరస్ సోకివుంటే, అది ఇంకొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఒకవేళ, వాహనదారులు ఎవరైనా మద్యం తాగినట్టు పోలీసులకు రూఢీగా తెలిస్తే, ఇతర మార్గాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని రవికాంతే గౌడ ఆదేశించారు. ఏది ఏమైనా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ఆగిపోవడంతో మందు బాబులు ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version