ఏపీ పాలిటిక్స్‌లో ప్రమాణాల సీజన్‌..ఈసారి సింహాద్రి అప్పన్న సాక్షిగా

-

ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ప్రమాణాల సీజన్‌ నడుస్తోంది. అనపర్తి తర్వాత ఇప్పుడు విశాఖలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల రాజకీయం వేడెక్కుతోంది. తన బినామీ ఆస్తులను నిరూపించేందుకు సాయిబాబాపై ప్రమాణం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి సవాల్ చేశారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వెలగపూడి అక్రమ ఆస్ధులపై సింహాద్రి అప్పన్న సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమా..? అని ఛాలెంజ్‌ చేశారు.

విశాఖలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల స్వాధీనం వ్యవహారం.. అటుతిరిగి, ఇటు తిరిగి దేవుళ్లపై ప్రమాణాల వరకు వెళ్లింది. స్టీల్ సిటీలో వందల కోట్ల విలువైన సర్కార్ ఆస్ధుల స్వాధీనం కోసం 8నెలలుగా స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది. బీఆర్టీఎస్ రోడ్డును ఆనుకుని రామక్ర్రష్ణాపురం, క్ర్రష్ణాపురంలో పేదల ఆధీనంలో వున్నట్టుగా చెప్తున్న భూములను.. జీవీఎంసీ స్వాధీనం చేసుకోవడం రాజకీయంగా వివాదం రాజేసింది. ఈ చర్య వెనుక దురుద్దేశాలు ఉన్నాయని.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్ర్రష్ణబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ తీవ్రంగా పరిగణించింది.

ఇవిగో ఎమ్మెల్యే అక్రమాలు, బినామీల ఆస్ధులు అంటూ ఓ జాబితాను ఎంపీ విజయసాయిరెడ్డి కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. దీనిపై ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే వెలగపూడి. విజయసాయిరెడ్డి ప్రకటించినట్టుగా తనకు అక్రమ ఆస్ధులు వున్నట్టు నిరూపిస్తే రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతానని ప్రకటించారు. ఈస్ట్ పాయింట్ కాలనీ షిరిడీ సాయిబాబా గుడిలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని.. అందుకు సాయిరెడ్డి కూడా సిద్ధపడాలని సవాల్ విసిరారు.

వెలగపూడి సవాల్ కు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రామకృష్ణబాబు వీధి రౌడీగా మొదలై కిల్లర్‌గా తయారయ్యాడని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రమైన ఆరోపణలు
చేశారు. వైజాగ్ వచ్చేనాటికి వెలగపూడి ఆస్ధులు…ప్రస్తుతం వున్న ఆస్ధులపై ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు అమర్నాథ్. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి విసిరిన సవాల్ కు ఒక్క అమర్నాథ్ మాత్రమే కాదు.. ఆ పార్టీకి చెందిన సీనియర్లు సైతం తొడగొడుతుండటంతో.. విశాఖ రాజకీయం మరింత హీటెక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version