శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కొన్ని మాటలు రాజకీయ రంగం గురించి రాయాలి. ముఖ్యంగా రాజకీయంతో పాటు ఇంకొన్ని తెలివి గల రంగాలు ఉన్నా కూడా అన్ని రంగాలనూ శాసించే రంగం ఇదొక్కటే కనుక రాయాలి. మెలకువలో ఎలా ఉన్నా కూడా కలల ప్రపంచంలో రాజకీయం బాగుంటుంది. హామీలు ఇచ్చేటప్పుడు ఇంకా బాగుంటుంది. నోటికి హద్దు అన్నది లేకుండా చెప్పే మాటలు విన్నప్పుడు కూడా ఇంకా బాగుంటుంది.ఆ విధంగా రాజకీయం బాగుంటుంది. ఈ ఏడాది వినిపించే రాజకీయ పంచాంగం ఎలా ఉంటుందో చూడాలిక .
జగన్ : వస్తున్న రెండేళ్లూ కీలకంగా ఉంటాయి. ఆ విధంగా వైఎస్సార్సీపీ మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆ విధంగా ప్రజలకు చేరువ కావాలి. ప్రతి సంక్షేమ పథకం రాజకీయానికి ఉపయోగించుకోవాలి. ఓటు బ్యాంకు రాజకీయాల వైపు మళ్లించాలి. ఆ విధంగా ఉంటే జగన్ కు మరో సారి రాజయోగం ఖాయం.ఆ విధంగా క్షేత్ర స్థాయిలో అంతా కలిసి పనిచేస్తే కొత్త మంత్రి వర్గంతో కొన్ని అద్బుతాలు చేయగలిగితే జగన్ విన్నర్ కావడం తథ్యం.
చంద్రబాబు : పద్నాగేళ్లు పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జాతక చక్రం మూడేళ్లుగా బాలేదు. ఎంతగా రాజకీయంగా పేరు తెచ్చుకుందాం అనుకున్నా ఆయనకు అడుగడుగున్నా అడ్డంకులు వస్తున్నాయి. ఒకనాటి బాబుకు ఇప్పటి బాబుకు ఉన్న తేడా ఏంటంటే ఆ రోజు ఆయన మాటకు ఎదురు లేదు. ఇప్పుడు ఆయన మాట వినే వారే లేరు. చంద్రబాబు ఒక్కరి కష్టం కారణంగా పార్టీ ఒడ్డెక్కదు. చినబాబు ఒక్కడి పోరాటం ఫలితం ఇవ్వదు. కనుక ఈ సారి చంద్రబాబుకు అనుకున్న విధంగా గ్రహగతులు ఉండాలంటే మరింత కష్టపడి అన్నింటినీ గాడిలో పెట్టాల్సిందే.
కేసీఆర్ : పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కొన్ని సానుభూతి రాజకీయాలతో నెగ్గుకువస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. కానీ సమర్థనీయ ధోరణిలో కేసీఆర్ పనిచేస్తున్నారు అన్నది వాస్తవం.ఆ విధంగా ఆయన అనుకున్నవి సాధించేరు. ఇంకొన్ని పెండింగ్ పనులు ఇదే సంకల్పంతో పూర్తి చేస్తే సత్ఫలితాల సిద్ధి సాధ్యం. ఢిల్లీలో బీజేపీతో పోరు పెద్దగా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపదు కానీ ఎందుకనో ఆయన మరోసారి సెంటిమెంట్ రాజకీయాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుండడం విశేషం. ఉద్యోగాల విషయమై ఇచ్చిన ప్రకటన కు కట్టుబడి పనిచేస్తే ఫలితాల సిద్ధి సాధ్యం.ఆ విధంగా ఈ సారి మరోసారి కూడా కేసీఆర్ కు రాజయోగం దక్కడం ఖాయం. రాజపూజ్యం బాగుండడం ఖాయం.
కాంగ్రెస్ మరియు కాషాయం : రెండు పార్టీలూ కలిసి ఎత్తుగడలు వేసినా కేసీఆర్ ను ఢీ కొనలేవు. కొంతలో కొంత రేవంత్ రెడ్డి హడావుడి చేసినా తరువాత ఆయన తగ్గిపోయారు. కిషన్ రెడ్డి లాంటి వారు ఢిల్లీకే పరిమితం కనుక రాశి ఫలాలలో కాంగ్రెస్ కు అయినా కాషాయ దళానికి అయినా దక్కేది శూన్యం. బలమైన ప్రతిపక్షంగా ఈ రెండూ లేవు కనుక సాధించేది ఏమీ ఉండదు అని ఇవాళ తేలిపోయింది. ఈ ఉగాదిలో తీపి కన్నా చేదే ఎక్కువ.