విశాఖ భూ స్కామ్‌లో ‘పెద్దల’ చిట్టా బయటపడిందా?

-

విశాఖను ఎగ్జిక్యూటీవ్‌ క్యాపిటల్‌గా ప్రకటించాక ఇక్కడ ఫోకస్‌ పెంచింది ప్రభుత్వం. అమరావతిలా కాకుండా.. ప్రభుత్వ భూముల్లోనే సర్కారీ ఆఫీసులను నిర్మించాలని చూస్తోంది. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములపై దృష్టి పెట్టిన క్రమంలో ‘పెద్దలు’ గెద్దల్లా తన్నుకుపోయిన భూముల చిట్టా బయటపడింది. దీనికితోడు గత ప్రభుత్వ హయాంలో భీమిలి భూ కుంభకోణంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ దిశగా విచారణ చేసిన సర్కార్‌కు పెద్ద కబ్జా తీగే తగిలినట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఆక్రమణలో ఉన్న భూములను స్వచ్ఛందంగా తిరిగి ఇవ్వాలి. లేదంటే యాక్షన్‌ ఉంటుంది. క్రిమినల్‌ కేసులు.. అరెస్ట్‌లు ఉంటాయి అని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కొందరు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అంటే.. ఆక్రమణదారుల ఎవరనేది ప్రభుత్వం గుర్తించిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్ట్‌ చేసే అధికారం రెవెన్యూ చట్టంలోనే ఉంది. కానీ.. ఇప్పటి వరకూ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కబ్జాదారులను హెచ్చరించి వదిలేసేవారు. ఇప్పుడు కేసులు.. అరెస్ట్‌లు అని వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇది పొలిటిల్‌ గేమో ఏమో కానీ.. ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేసిందన్నది మాత్రం అంతుచిక్కడం లేదు.

ఈ మధ్యకాలంలో విశాఖలో కూల్చివేతలు రాజకీయంగా కలకలం రేపాయి. మాజీ ఎంపీ సబ్బంహరి.. 50 గజాలు ఆక్రమించారంటూ అక్కడి కట్టడాలను కూల్చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ రోడ్డులో 60 ఏళ్లుగా వ్యాపారం చేస్తోన్న షాపులను తొలగించారు. వీరంతా తమ పార్టీ సానుభూతిపరులు కావడం వల్లే తొలగించారన్నది టీడీపీ ఆరోపణ.

గీతం వర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న 800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు. గీతం అధిపతి భరత్‌.. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు. అలాగే మాజీ మంత్రి గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్‌కు చెందిన గోకార్టింగ్‌ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.రుషికొండ బీచ్‌ రోడ్డులో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు చెందిన భూమిలో 6 సెంట్ల కొండ కాల్వ భూమి కలిసినట్టుగా గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణ కుటుంబానికి చెందిన 300 ఎకరాల భూముల్లోనూ కబ్జాలు ఉన్నట్టు అనుమానించిన అధికారులు అక్కడ సర్వే నిర్వహించారు. వాటిల్లో జిరాయితీ భూములకు ఆనుకుని దాదాపుగా 60 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు నిర్ధారించింది రెవెన్యూ యంత్రాంగం. అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది.

మరి.. నెక్ట్స్‌ ఎవరు? ఎవరి భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టబోతున్నారు? అన్న ప్రశ్నలు విశాఖలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version