కేసీఆర్ వద్దు.. జగన్ ముద్దు.. ఇదే తరహా రాజకీయం కేంద్రంలోని బీజేపీ పెద్దలు చేస్తున్నారా ? జగన్‌కు చేరువ కావడం ద్వారా ఏపీలో తమ ఉనికిని చాటుకోవాలని అనుకుంటున్నారు అదే సమయంలో కేసీఆర్‌తో కయ్యానికి కాలుదువ్వి .. అక్కడ బలపడాలని భావిస్తున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా కేసీఆర్‌ను కేంద్రం టార్గెట్ చేసింది. కొన్నాళ్ల కిందటి వరకు కూడా జగన్‌కు వ్యతిరేకంగా ఉండాలని భావించిన బీజేపీ.. తర్వాత మనసు మార్చుకుంది. జగన్‌కు సానుకూలం కావడం ద్వారా ప్రధాన ప్రతిపక్షం అనే స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే తమ జట్టుకట్టిన పవన్ కళ్యాణ్‌తోనూ సైలెంట్ మంత్రాన్ని జపిస్తోంది. దీంతో పవన్ జగన్ ప్రభుత్వం పై విమర్శలను తగ్గించేశారు.
దీనివల్ల ఏపీలో జగన్ సర్కారు బలపడినా.. తమకు ఎదిగేందుకు ఎలాంటి అవరోధాలు ఉండబోవని చెబుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమానికి మోడీ పేరును కూడా తగిలించడం, ఇప్పుడు పేదలకు ఇస్తున్న ఇళ్ల విషయంలో కేంద్రానికి బెనిఫిట్ ఇస్తానని జగన్ హామీ ఇవ్వడం వంటి పరిణామాలు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా.. తమకు బలంగా ఉన్న నాయకుడు జగన్ అధికారంలో ఉండే చాలనే అభిప్రాయంతో ఉన్నారు.
అదే సమయంలో కేసీఆర్ విషయంలో కయ్యానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జగన్ చేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం తెలంగాణలో కడుతున్న నీటి ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాదు, ఇటీవల కరోనాపై ప్రధాని నరేంద్ర మోడీ సీఎంలతో జరిగిన సమావేశంలోనూ జగన్‌ను ప్రస్తుతించకపోయినా.. అదేసమయంలో కేసీఆర్‌ను హెచ్చరించారు. అత్యంత ఎక్కువ కరోనా కేసులు వస్తున్న రాష్ట్రాల జాబితాలో ముఖ్యంగా పరీక్షలు చేయని రాష్ట్రాల్లో తెలంగాణకూడా ఉందని ఆయన హెచ్చరించారు. ఆ వెంటనే గవర్నర్ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. కేంద్రం వ్యూహాత్మకంగా రాజకీయ కోణంలో రెండు తెలుగు రాష్ట్రాలపై చక్రాలు తిప్పుతోందనే భావన స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. రాజధాని విషయంలో జోక్యం చేసుకునేది లేదని అంటూనే చంద్రబాబు ఆనాడు తమకు చెప్పలేదని చెప్పడం ద్వారా తప్పు మాదీ కాదు.. జగన్‌దీ కాదు.. ఏమైనా ఉంటే.. చంద్రబాబును అడగండి అనే ధోరణి వెనుక కూడా ఏపీలో జగన్‌కు సపోర్టు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. మరి ఈ రాజకీయంగా ఎవరు ఎలాంటి మార్పుతో ముందుకు వస్తారో చూడాలి.