సాధారణంగా వినాయకచవితి పండుగ వస్తుందంటే అన్నీ వూరుల్లో సందడి నెలకొంటుంది. వూరుల్లోని యువత తమ ప్రాంతాల్లో వినాయకుడు బొమ్మని నిలబెట్టి ఘనంగా పండుగ చేయాలని అనుకుంటారు. పండుగకు వారం రోజుల ముందు నుంచే చందాలు వసూలు చేస్తూ, మండపాన్ని అందంగా ముస్తాబు చేసి వినాయకుడుని తీసుకొచ్చి పూజ చేస్తారు. అలాగే వినాయక నిమజ్జనం కార్యక్రమానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొని డ్యాన్సులు వేస్తూ ఆనందిస్తారు.
అయితే ఇలా అందరూ ఘనంగా జరుపుకునే వినాయకచవితి విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లచ్చిరాజుపేట గ్రామ ప్రజలకు మాత్రం కలిసిరావట్లేదు. గత రెండు దశాబ్దాలుగా ఆ గ్రామ ప్రజలు వినాయకచవితి వేడుకలకు దూరమయ్యారు. 20 ఏళ్ల క్రితం వినాయకచవితి పండుగ ఏర్పాట్లు సమయంలో ఆ ఊరిలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. దీంతో అప్పటి నుంచి ఆ ఊరు ప్రజలు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం మానేశారు.
అయితే పండుగ జరిపే సమయంలోనే ఇలా జరగడం పట్ల ఆందోళన చెందుతున్న కొందరు గ్రామ పెద్దలు పరిష్కారం కోసం పండితులతో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి అయితే ఆ ఊరు ఈ ఏడాది కూడా వినాయకుని ఉత్సవాలు జరుపుకోలేకపోతున్నాయి.