తాడిపత్రి మున్సిపల్ ఆఫీసులో ఉద్రిక్తత.. రాత్రంతా జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన

-

అనంతపురం: తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇప్పుడా ఎఫెక్ట్ మున్సిపల్ అధికారులపై పడింది. సోమవారం మున్సిపల్ అధికారులతో పెద్దారెడ్డి సమీక్ష నిర్వహించారు. అదే సమయంలో మున్సిపల్ ఛైర్మన్ హోదాలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా సమావేశం నిర్వహించారు. అయితే జేసీ సమీక్షకు అధికారులు హాజరుకాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు అధికారులు రావాల్సిందేనంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించారు.

సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఆయన మున్సిపల్ కార్యాలయంలో ఉన్నారు. అధికారులు వచ్చే వరకూ బైఠాయించాలని జేసీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యలో ఏం జరుగుతుందోనని మున్సిపల్ సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

అయితే మున్సిపల్ కమిషనర్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా సెలవుపై వెళ్లడాన్ని జేసీ వర్గం కౌన్సిలర్లు తప్పుబడుతున్నారు. ఛైర్మన్‌ సమావేశానికి హాజరుకాకపోవడంపై అధికారులకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి రాత్రంతా మున్సిపల్ కార్యాలయంలో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version