భారతరత్న, మాజీ ప్రధాని వాజ్ పేయి గురువారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఆయన మృతితో యావత్తు భారతావని మూగబోయింది. దేశ ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈసందర్భంగా పలువురు ప్రముఖులు, ఇతరులు వాజ్ పేయితో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాజ్ పేయి జర్నలిస్టుగా ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను తాను ప్రధానిగా ఉన్నప్పుడు గుర్తు చేసిన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
“నేను ఓ పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న సమయంలో.. ఓ రోజు పోలీసులు కొందరు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఆ వార్త నా దగ్గరకు వచ్చింది. ఇంగ్లీష్ లో ఆ వార్త ఉంది. దాన్ని నేను హిందీలోకి ట్రాన్స్ లేట్ చేయాలి. ఆ వార్తలో పోలీస్ ఓపెన్డ్ ఫైర్ అని ఇంగ్లీష్ లో ఉంటే.. దాన్ని నేను పులిస్ నే ఆగ్ ఖోల్ దియా అని తప్పుగా అనువదించాను.. అంటూ నవ్వుతూ తెలిపారు. దాని అర్థం తెలుగులో పోలీసులు నిప్పులు తెరిచారు అని. అంతే కాదు.. బ్రిటీష్ వాళ్లు మన పోరాటానికి భయపడి కాదు.. మన ఇంగ్లీష్ ను చూసి భయపడి వాళ్ల దేశానికి పారిపోయి ఉంటారు..”అని అప్పుడప్పుడు సరదాగా వాజ్ పేయి వ్యాఖ్యానించేవారు.