ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మరో సారి టీడీపీకి దగ్గరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జగన్ తమకు ఊపిరి సలపనివ్వకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం తమ అభ్యర్థుల నామినేషన్ వేయడానికి కూడా అవకాశం లేకపోవడం, అసలు కనీసం అభ్యర్థులు లేకపోవడంతో ఇప్పుడు బీజేపీ నేతలు మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నారు .
2019 లో జరిగిన ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపించలేదు. ఇక ఎన్నికల తర్వాత ఆరు నెలలు ఆగి జనసేన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే ఇప్పుడు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నా సరే బీజేపీకి వచ్చే లాభం ఏమీ లేకపోవడంతో మరోసారి బిజెపి నేతలు తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడుతున్నారు.
అలాగే మరికొందరు నేతలు కూడా తెలుగుదేశం పార్టీతో ప్రత్యక్ష పరోక్ష స్నేహం చేస్తున్నారు. తాము జగన్ తో రహస్యంగా స్నేహం చేసినా సరే దానితో రాజకీయంగా తమకు వచ్చే ఉపయోగాలు ఏమీ ఉండవని ఒక అంచనాకు వచ్చిన బీజేపీ పెద్దలు ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు బీజేపీ అవసరం ఉంది. దీనితో ఆయనను దగ్గర చేసుకుని రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నాలను బీజేపీ నేతలు చేస్తున్నట్లు సమాచారం.