ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వితంతు పెన్షన్లు నిలిపివేయడంపై ప్రభుత్వంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో పెన్షన్లు నిలిపివేశారన్న కేసులో ప్రభుత్వ కౌంటర్ పై రాష్ట్ర హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వితంతువులంటూ అబద్దాలు చెబుతున్నారనడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసింది. ఏ మహిళా కూడా భర్త ఉన్నప్పటికీ వితంతువునని చెప్పదని, ఒంటరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలుసని న్యాయస్థానం ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చింది.
ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వారి ఆర్ధిక కష్టాలను కొంతవరకు తీరుస్తుందని కోర్టు వ్యాఖ్యలు చేసింది. పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? అని నిలదీసింది. రంజాన్ తోఫా, క్రిస్‌మస్ కానుకలు ఇవ్వమని ఎవరైనా అడిగారా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. కోట్లు వెచ్చించి ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వెయ్యమని ఎవరైనా అడిగారా? అని నిలదీసింది.