ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న నామినేటెడ్ పదవులపై సీనియర్‌లు చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండునెలలు గడుస్తున్నా ఇంతవరకు నామినేటెడ్ పదవుల ఊసేలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా తనకు ఫలానా పదవి కావాలంటూ బయటికి వస్తున్నారు. కానీ ఓ సీనియర్ నేతను మూడు పదవులు ఊరిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు.రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో పలు పదవులు నిర్వహించారు ఆయన. గత ఎన్నికల్లో పోటీ చేయని ఆయనకు ఇప్పుడు ఏ పదవి ఇస్తారనే ఆసక్తి కొనసాగుతోంది.తెలుగుదేశం పార్టీలో ఉన్న మోస్ట్ సీనియర్స్ లిస్ట్‌లో ఆయన కూడా ఒకరు.
రాజకీయంగా కేంద్ర, రాష్ట్రస్థాయి పదవులు నిర్వహించిన ఆయన గత పాలనలో అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి ఈసారి చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. అశోక్ గజపతి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఆయన ఖచ్చితంగా మంత్రి అయ్యేవారు. అయితే ఆయన కుమార్తె అదితి విజయనగరం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఆమెకు మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది అనుకుంటే.. బీసీ సామాజిక వర్గానికి చెందిన తూర్పు కాపు ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రిగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు.
ఆయన గజపతినగరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదే సమయంలో అశోక్ గజపతిరాజు స్థాయికి తగినట్టుగా టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే కేంద్రంలో ఎన్డీయే కూటమిలో కేంద్రంలో కూడా టిడిపి అధికారంలో ఉండడంతో అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పైగా అశోక్ గజపతి అంటే ప్రధానమంత్రి మోడీతో పాటు బిజెపిలోని పెద్దలకు ఎంతో ఇష్టం. అందుకే టీటీడీ చైర్మన్ లేదా గవర్నర్ పదవులలో ఏదో ఒకటి కచ్చితంగా అటు బీజేపీ నేతలే చెబుతున్నారు.
ఈ రెండూ కాకపోతే రాజ్యసభ రేసులోనూ అశోక్ గజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్రస్థాయిలో పరిచయాలు ఉన్న అశోక్ కూడా తాను రాజ్యసభకు వెళ్లేందుకే ఇష్టపడుతున్నారని సమాచారం. ఏపీ నుంచి ఇప్పుడప్పుడే రాజ్యసభకు పంపే అవకాశాలు లేవు. రెండేళ్ళపాటు ఆయన ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈలోపు రేసులోకి మరొకరు వస్తే రెండేళ్ళ తరువాత అది కూడా దక్కకపోవచ్చు అనే టాక్ కూడా నడుస్తోంది. మరి ఇంలాటి నేపథ్యంలో అశోక్ గజపతిరాజు ముందు ఉన్న మొదటి రెండు ఆప్షన్స్‌లలో ఏదో ఒకటి ఎంచుకోకతప్పదని అంటున్నారు. మరి అశోక్ గజపతిరాజు మనసులో ఏముందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.