బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు . కింది స్థాయి కార్యకర్త నుంచి ఎదిగిన నాయకుడు. ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసిన ఓడిపోయిన, ఎంపీగా సత్తా చాటారు. అలాగే తెలంగాణ బిజేపి అధ్యక్షుడుగా పనిచేసి..ఎప్పుడూలేని విధంగా పార్టీని బలోపేతం చేశారు. అధ్యక్షుడుగా తప్పుకున్నాక బిజేపి జాతీయ కార్యదర్శిగా కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ముందుకెళుతున్నారు.
అయితే బండి పోటీ చేసే సీటుపై రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఇంతవరకు ఆయన పోటీ చేసే సీటు క్లారిటీ రాలేదు. కానీ తాజాగా బండి పోటీ చేసే సీటుపై ప్రకటన చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుండి పోటీ చేయాలని బండి సంజయ్ డిసైడ్ అయ్యారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు, అపోహలకు తావు లేదని బండి సంజయ్ అంటున్నారు.
కరీంనగర్ నుండి బిఆర్ఎస్ తరఫున గంగుల కమలాకర్ పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు అసెంబ్లీ తరపున పోటీ చేసి పరాజయం పొందిన సంజయ్ ఈసారి గెలుపు సాధించాలని ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజలు కార్యకర్తలు బిజెపి వైపు ఉన్నారని బండి గట్టిగా చెబుతున్నారు. బిఆర్ఎస్ అంగబలం, అర్ద బలంతో గంగుల కమలాకర్ ను గెలిపించాలని చూస్తున్నదని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి కరీంనగర్ లో గెలిచి తీరుతానని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కరీంనగర్ లో ఈ సారి పోరు రసవత్తరంగా ఉంటుంది. ఇంతకాలం గంగుల వన్ సైడ్ గా గెలిచారు..కానీ ఈ సారి బండి గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఈ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.