బండి సంజ‌య్‌కే సార‌థ్య బాధ్య‌త‌లు… త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్న అధిష్టానం

-

తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్య‌క్ష రేసులో రోజుకో పేరు తెర‌మీదికి వ‌స్తోంది. పాత‌, కొత్త అనే తేడా లేకుండా అంద‌రి పేర్లూ వినిపిస్తున్నాయి. లోక్‌స‌భ‌కు ఎన్నికైన 8 మంది ఎంపీలు రేసులో ఉన్న‌ట్లు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలు అధిష్టానాన్ని కలిసి తమను ఎంపిక చేయడం ద్వారా రాష్ట్రానికి, పార్టీకి ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే అంశాలను హైకమాండ్ కు వివరించారు.

అయితే అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కోసం బీజేపీ హైకమాండ్ ప్రయత్నం చేయడం సర్వ సాధారణం. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపికలో మాత్రం నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క నేత పేరు చెప్పినా వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేందుకు ఏకాభిప్రాయం రావడం లేదు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అధిష్టానానికి టాస్క్‌గా మారింది.

ఇదిలా ఉంటే…కేంద్ర‌మంత్రి, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కు మ‌ళ్లీ పార్టీ బాధ్య‌త‌లు ఇవ్వ‌బోతున్నార‌నే టాక్ న‌డుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న్ను త‌ప్పించి త‌ప్పు చేశామ‌న్న భావ‌న‌లో కేంద్ర నాయ‌క‌త్వం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కిష‌న్ రెడ్డి అధ్య‌క్షుడిగా ఉన్నా… ఆయ‌న కేంద్రమంత్రి ప‌ద‌విలో ఫుల్ టైం వ‌ర్క‌ర్‌గా మారిపోయారు. దీంతో రాష్ట్ర పార్టీ పెద్ద‌గా ఎలాంటి కార్య‌క్ర‌మాలు తీసుకోవ‌టం లేదు. నిజానికి ఎన్నిక‌ల‌కు ముందు బండి సంజ‌య్ అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో పార్టీకి మంచి మైలేజ్ వ‌చ్చినా…ఉన్న‌ట్టుండి ఆయ‌న్ను త‌ప్పించారు.

ఆ ప్ర‌భావం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌న‌పించింది. ఆ త‌ర్వాత ఎంపీ ఎన్నిక‌లు కూడా అలా అలా గ‌డిచిపోయాయి. ఏ క్ష‌ణంలోనైనా కిష‌న్ రెడ్డిని అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుండి త‌ప్పిస్తార‌న్న‌ది పార్టీలో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఆయ‌న్ను త‌ప్పిస్తే ఈట‌ల‌కు ఛాన్స్ ఉంటుంది అని అంతా అనుకుంటున్న స‌మ‌యంలో బండి సంజ‌య్ మ‌ళ్లీ యాక్టివ్ కావ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కేంద్ర‌మంత్రిగాఉన్న కిష‌న్‌రెడ్డి తెలంగాణ పార్టీ చీఫ్‌గా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.క‌నీసం రేవంత్ స‌ర్కారు నిర్ణ‌యాల‌పై ఎలాంటి కామెంట్లు చేయ‌డం లేదు.లోక్‌స‌భ‌లో ప్రాతినిథ్యం వ‌హిస్తున్న 8 మంది ఎంపీలు సైతం రాష్ర్ట రాజ‌కీయాల‌పై అంటీముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేంద‌ర్ అప్పుడ‌ప్పుడూ పొలిటికల్‌గా కామెంట్లు విసురుతున్నారు. కానీ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజ‌య్ మాత్రం ఈ మ‌ధ్య‌ రాష్ట్ర వ్య‌వ‌హ‌రాల్లో చురుగ్గా ఉంటున్నారు.

ఖ‌మ్మం వ‌ర‌ద‌ల విష‌యంలోనూ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు రెడీ అయ్యారు.రాష్ర్టంలో బండి సంజ‌య్ మ‌ళ్ళీ స్పీడ్ పెంచ‌టంతో ఆయ‌నకు రాష్ట్ర బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారా అనే టోక్ జోరందుకుంది. కేంద్ర‌మంత్రిగా ఉన్నా రాష్ట్ర పార్టీ బాధ్య‌త‌లు కూడా నిర్వ‌హించ‌గ‌ల స‌మ‌ర్ధ‌త ఆయ‌న‌కు ఉంది.ఈ విష‌యంపై పార్టీ వ‌ర్గాలు కూడా సానుకూలంగా చర్చించుకుంటున్నారు.పార్టీ అధినాయ‌క‌త్వం కూడా గ‌తంలో చేసిన త‌ప్పుతో మ‌రోసారి బండికే అవ‌కాశం ఇవ్వ‌బోతుంద‌న్న ప్ర‌చారం జోరుగా పార్టీలో సాగుతోంది.సంజ‌య్‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని తెలంగాణ బీజేపీ కేడ‌ర్ ఆశిస్తోంది. ఫైన‌ల్‌గా ఏం జ‌రుగ‌బోతోందో చూడాలి

Read more RELATED
Recommended to you

Exit mobile version