తెలంగాణా రాజ్యసభ అభ్యర్ధులను తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేసారు. ఆ పార్టీ నుంచి ప్రస్తుత రాజ్యసభ ఎంపీ కే కేశవరావు, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావును రాజ్యసభ ఎంపీ అభ్యర్ధులుగా అధికార పార్టీ ఖరారు చేసింది. ఈ నెలలో రెండు రాజ్యసభ స్థానాలు తెలంగాణాలో ఖాళీ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎవరిని ఎంపిక చేస్తారు అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
ఈ తరుణంలో కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 11 గంటలు ఈ ఇద్దరు నేతలు రాజ్యసభకు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. కేకే ప్రస్తుతం తెరాస పార్లమెంటరి పార్టీ నేతగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా పని చేసారు. ఆయనకు పార్టీలో కూడా కీలక పదవి అప్పగించారు. సమర్ధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ముందు నుంచి ఈ ఎంపికపై అనేక ఊహాగానాలు వచ్చాయి.
నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పేరుని కెసిఆర్ ఖరారు చేస్తారని అందరూ భావించారు. అలాగే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరుని కూడా పరిశీలించారు కెసిఆర్. మళ్ళీ సీనియర్ నేత కేకే ని రాజ్యసభకు పంపాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. రెండో అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కెసిఆర్ సుధీర్గ కసరత్తు చేసారు. హెటిరో డ్రగ్స్ అధినేత, బండి పార్ధసారధి రెడ్డి పేరుని కూడా పరిశీలించారు.