ఏపీలో విపక్ష టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పార్టీలో ఎవరూ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. ఇంకా వీడుతున్నారు. చంద్రబాబుపై నమ్మకం లేదు.. లోకేష్ ఉంటే భవిష్యత్తు లేదనే చాలా మంది భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కీలక నేత సైతం పార్టీ జెండా పీకేసి తన దారి తాను చూసుకునేందుకు రెడీ అవుతున్నాడా ? అన్న సందేహాలు టీడీపీ వాళ్లల్లోనే వస్తున్నాయి. ఆ కీలక నేత ఎవరో కాదు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని.
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తెను మేయర్ చేసుకోవాలని ఆయన ప్లానింగ్‌తో ఉన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ మంత్రులు, ఆ పార్టీ పెద్దలతో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల పార్టీ పదవుల్లోనూ చంద్రబాబు ఆయనకు ప్రయార్టీ ఇవ్వలేదు. ఇక చంద్రబాబు ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు కూడా నాని కలిసేందుకు ఇష్టపడలేదు. తన పార్లమెంటు పరిధిలో తాను పర్యటిస్తున్నప్పుడు తన కేడర్‌కే ఆయన ఫోన్లు చేసుకుంటున్నారు.
పైగా ఎన్నికల్లో ఓడిపోయిన ఉమా లాంటి వాళ్లకే చంద్రబాబు ప్రయార్టీ ఇవ్వడాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదేమైనా నాని తీరు చూస్తుంటే ఆయన ఎక్కువ కాలం పార్టీలో ఉండే అవకాశం లేదని టీడీపీ వర్గాలే అంటున్నాయి.