టీ కాంగ్రెస్‌లో బిగ్ వికెట్లు ట‌పాట‌పా…!

-

తెలంగాణ రాజ‌ధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీకి వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. వ‌రుస పెట్టి ఆ పార్టీ కీల‌క నేత‌లు గుడ్ బై చెప్పేస్తున్నారు. నిన్న‌టికి నిన్న రేవంత్‌రెడ్డి అనుచ‌రుల‌పై గురి పెట్టి వారిని త‌మ పార్టీలో చేర్చుకున్న బీజేపీ పెద్ద‌లు కాంగ్రెస్‌లో అసంతృప్త నేతలు ఎవ‌రైనా ఉంటే వారికి కాషాయ కండువా క‌ప్పేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో దుమ్ము రేపుతాం అని ఘోరంగా మూడో స్థానంతో స‌రిపెట్టుకున్న కాంగ్రెస్ ఆ అవ‌మానం నుంచి కోలుకోక ముందే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లోనూ షాకుల‌తో అత‌లా కుత‌లం అవుతోంది.

గ్రేట‌ర్‌కు చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు హ‌స్తం పార్టీకి ఒక్కొక్క‌రుగా హ్యాండ్ ఇస్తున్నారు. ఇప్పటికే శేరిలింగంప‌ల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌, శేరిలింగంపల్లి ఇన్‌ఛార్జ్‌ రవికుమార్ ‌యాదవ్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అదే బాట‌లో సికింద్రాబాద్ మాజీ ఎంపీ, గ్రేట‌ర్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు అంజ‌న్ కుమార్ యాద‌వ్ కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న కూడా అలిగి తాజాగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై గాంధీభ‌వ‌న్లో జ‌రిగిన స‌మావేశానికి డుమ్మా కొట్టార‌ని తెలుస్తోంది.

త‌న‌కు స‌మాచారం ఇవ్వ‌కుండానే టిక్కెట్లు కేటాయిస్తున్నార‌నే ఆయ‌న అధిష్టానంపై గుస్సాతో ఉన్నార‌ట‌. ఆయ‌న కూడా అల‌క పాన్ఫు వీడ‌క‌పోతే త్వ‌ర‌లోనే బీజేపీలో చేరిపోతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఇప్ప‌టికే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌, రవికుమార్‌ యాదవ్‌ బీజేపేలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

ఆమెకు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ సీటుపై బీజేపీ నుంచి హామీ రావ‌డంతోనే ఆమె పార్టీ కండువా మార్చేశార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె అనుచ‌రులు ముగ్గురికి బీజేపీ కార్పొరేట‌ర్ సీట్లు ఇచ్చేందుకు కూడా బీజేపీ పెద్ద‌లు ఒప్పుకున్నార‌ట‌. ఇదే లిస్టులోనే మ‌రికొన్ని పెద్ద వికెట్లు కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి కాషాయ గూటికి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version