తెలంగాణ రాజకీయాల్లో జోగు రామన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు…మొదట్లో టీడీపీ, ఆ తర్వాత టీఆర్ఎస్ లో కీలక నేతగా పనిచేస్తూ వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపగల నాయకుడు. మొదట టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి…కింది స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చారు. సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసి గా గెలుస్తూ వచ్చారు. టీడీపీలో కీలక నేతగా ఎదుగుతూ వచ్చిన జోగు…2009లో ఆదిలాబాద్ అసెంబ్లీలో పోటీ చేసి గెలిచారు…ఇక తర్వాత తెలంగాణ ఉద్యమం ఉదృతం అవుతున్న నేపథ్యంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
2012 ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు..అలాగే 2014లో కూడా టీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఇక కేసీఆర్ కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా ఆదిలాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇలా వరుసగా గెలుస్తూ సత్తా చాటుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తూ టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
అయితే రాజకీయాల్లో ఎంతో సీనియర్ నాయకుడుగా ఉన్న జోగు కెరీర్ కు బ్రేక్ పడే సమయం ఆసన్నమైంది. వరుసగా ఆదిలాబాద్ అసెంబ్లీలో తిరుగులేకుండా గెలుస్తున్న జోగు రామన్న జోరుకు బీజేపీ చెక్ పెట్టనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పుంజుకుంటున్న బీజేపీ..ఆదిలాబాద్ లో ఇంకా బలపడింది. పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆదిలాబాద్ ఎంపీ సీటుని బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడే ఆదిలాబాద్ అసెంబ్లీలో బీజేపీకి మెజారిటీ వచ్చింది.
ఇక ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీలో బీజేపీ సత్తా చాటడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లోనే బీజేపీ బాగా కష్టపడి…చివరికి గెలుపు ముందు బోల్తా కొట్టింది. కానీ ఈ సారి పరిస్తితి అలా లేదు…టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతుంది..అదే సమయంలో బీజేపీ బలపడుతుంది. ఈ క్రమంలో ఆదిలాబాద్ లో జోగుకు ఈ సారి బీజేపీ బ్రేక్ వేసేలా ఉంది.