తెలంగాణ రాజకీయాల్లో కమలం పార్టీ దూకుడు కొనసాగుతుంది. అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడానికి బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో ముందుకెళుతుంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ…బీజేపీ నేతలు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. అటు కేంద్రం పెద్దల సపోర్ట్‌తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..డైరక్ట్‌గా కేసీఆర్‌పై పోరాటం చేస్తున్నారు. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనేలా బండి సంజయ్ పనిచేస్తున్నారు.
అందుకే ఎప్పుడు రాజకీయాల్లో లేని విధంగా చేరికల కోసం ఒక కమిటీని పెట్టారు. ఆ కమిటీకి ఛైర్మన్‌ని కూడా పెట్టారు. బీజేపీ సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి చైర్మన్‌గా పార్టీలో చేరికలు, సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఎస్సీ సమన్వయ కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని నియమించగా, జాతీయ కార్యవర్గసభ్యులు గరికపాటి మోహన్‌రావు చైర్మన్‌గా ఎస్టీ సమన్వయ కమిటీని నియమించారు. ఇలా బీజేపీలో సరికొత్త కమిటీలు వచ్చాయి. అయితే చేరికల కోసం కమిటీ పెట్టడం అంటే…పార్టీని మరింత బలోపేతం చేయడం కోసమే అని చెప్పొచ్చు.
ఇప్పటికే ఇతర పార్టీల నేతలు..బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. కొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ నేతలు సైతం టచ్‌లో ఉన్నారని చెబుతున్న విషయం తెలిసిందే. ఇక వారిని పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యత చేరికల కమిటీదే. అయితే సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డికి రాజకీయంగా చాలా అనుభవం ఉంది…ఆయనకు ఇతర పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయి. మరి ఈ చేరికల కమిటీతో టీఆర్ఎస్‌కు డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.