సారీ అంటున్న బీజేపీ సీనియర్లు.. ఒంటరిగానే బరిలో ఈటల..!

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి బరిలో నిలిచిన ఈటల రాజేందర్‌కు మొదటి నుంచి కమలం పార్టీలో సీనియర్ల మద్దతు లేదనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వస్తున్నాయి. ఈటల తరఫున ప్రచారానికి అంటే చాలు..సారీ అంటూ బీజేపీ సీనియర్లు రావడం లేదని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీలో ఉన్న సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డి ఆ పార్టీని వీడారని పేర్కొంటున్నారు. ఇక ఈటల మాత్రం ఒంటరిగానే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ పార్టీలోని సీనియర్ నేతలు చురుకుగా ఉన్నారని, హుజురాబాద్‌కు వచ్చేసరికి వారు స్తబ్ధుగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, బీజేపీ సీనియర్ నేతలు ఇలా చేయడం వెనుక కారణాలూ ఉన్నాయి. ఇనుగాల పెద్దిరెడ్డి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించారు. ఈ క్రమంలోనే తాను మరోసారి ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉండాలని భావించారని తెలుస్తోంది. కానీ, ఈటల కమలం పార్టీలో చేరికతో ఆయనే అభ్యర్థిగా మారారు. ఇక తనను కనీసం సంప్రదించకుండానే ఈటలను కమలం గూటిలో చేర్చుకోవడం పట్ల ఇనుగాల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా అధికార పార్టీ టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరారు. ఇప్పటికే మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అయితే, సీనియర్ నేతలు కూడా ప్రచారానికి వస్తారని బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ ఇంకా స్పష్టత లేదు. తెలంగాణ నుంచి ఇటీవల కేంద్ర కేబినెట్ మంత్రి అయిన సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈటల రాజేందర్ తరఫున ప్రచారం నిర్వహించేందుకు వస్తారా? రారా? అనేది కొద్ది రోజుల్లో తేలుతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ప్రచారానికి వస్తారని బీజేపీ శ్రేణులు పేర్కొంటుండగా, అది నిజమయ్యేనా? పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే రాజేందర్ ఒంటరిగానే హజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version