సీఎంను కలుస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. అందుకేనా…?

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు క్యూ కడుతున్నారు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.ముఖ్యంగా గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోని ఎమ్మెల్యేలతో రేవంత్‌రెడ్డి భేటీలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.క్యాడర్‌ ఉన్న లీడర్‌లను కాంగ్రెస్‌ పట్ల ఆకర్షిస్తున్నారని సీఎంపై రూమర్‌లు కూడా వస్తున్నాయి. గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. రానున్న లోక్‌సభ ఎన్నికలలోపు గ్రేటర్‌లో కాంగ్రెస్‌ని బలోపేతం చేసే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు రేవంత్‌ గాలం వేస్తున్నారని వినిపిస్తోంది.రేవంత్‌ మాస్టర్‌ ప్లాన్‌ ముందు బీఆర్‌ఎస్‌ వెనకబడటం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు గ్రేటర్ పరిధిలో కనీసం అభ్యర్ధులు లేని పరిస్థితి.2014లో బీఆర్ఎస్ మొదటి సారి అధికారంలోకి రాక ముందు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థులు లేక పోటీకి దూరంగా ఉండిపోయారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎలా బలపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వ్యూహంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల చాలా మంది నేతలు పార్టీని వీడిపోయారు. అలా వెళ్ళి బీఆర్‌ఎస్‌లో కీలకంగా మారిన నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలో అసంతృప్తులను లాగేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకోసం రేవంత్‌ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ రేడీ చేసి దాని ప్రకారంగా ఒక్కొక్కరిని తన వద్దకు పిలించుకుంటున్నారని సమాచారం.

బీఆర్ఎస్ పార్టీలో స‌రైన ప్రాధాన్యం ల‌భించ‌ని నేత‌లంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే బాటలో తాండూరు సీనియర్ నేత ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ఆయ‌న భార్య సునీత ఇంకా తీగ‌ల కృష్ణారెడ్డి కోడ‌లు, రంగారెడ్డి జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ అనితా రెడ్డితో పాటు ప‌లువురు కీల‌క నాయ‌కులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.2023 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి సిద్ధ‌మ‌య్యార‌ని తెలుసుకున్న కేసీఆర్.. హుటాహుటిన ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డికి చేవేళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. సీఎంను కలిసిన అంశంపై భిన్నంగా స్పందించారు. తనను టార్గెట్ చేయవద్దని చెప్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆయన సంకేతాలు ఇచ్చిన్టైంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీల వెనుక ఉన్నది పూర్తిగా రాజకీయమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్వరలో మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి తో తన నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారం కోసం సమావేశం కానున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు నేతలే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version