క్యాసినో-లిక్కర్ స్కామ్..’కారు’ షేక్..!

-

తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది..రాజకీయ పరంగానే కాదు..ప్రభుత్వాల పరంగా కూడా యుద్ధం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్లు పోరు జరుగుతుంది. ఎవరు అధికారాలని వారు వాడుతూ..తమ ప్రత్యర్ధులని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే కేంద్ర సంస్థలైన ఐటీ, ఈడీ, సి‌బి‌ఐ సంస్థలు…టి‌ఆర్‌ఎస్ నేతల వ్యాపారాలు టార్గెట్‌గా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయని, దీనిలో కవిత కూడా ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి..కవిత దగ్గర వ్యక్తులని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలిసింది. ఇక బీజేపీ అటు నుంచి వస్తుంటే..టీఆర్ఎస్ ఏమో..ఎమ్మెల్యేల కొనుగోలు తెరపైకి తీసుకొచ్చింది. ఆ కేసుని పెట్టుకుని బీజేపీని టార్గెట్ చేసింది. ఈ కేసు విషయంలో టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తుంది..ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనే అంశంపై విచారణ చేయిస్తుంది.

ఇక టీఆర్ఎస్ దూకుడుకు బ్రేక్ వేసేలా బీజేపీ..లిక్కర్ స్కామ్ విచారణని వేగవంతం చేసింది. అలాగే మళ్ళీ క్యాసినో కేసు తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌ని పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఉన్నారని అప్పటిలో సంచలనమైంది. అలాగే సినీ నటులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని తెలిసింది.

ఈ కేసుని మరోసారి ఈడీ పట్టుకుంది..నేపాల్‌ ఈవెంట్‌కు సంబంధించిన ఆధారాల్లో భాగంగా తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేశ్, ధర్మ యాదవ్‌లని ఈడీ విచారించింది. ఇక ఈ కేసుకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణకు, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మెదక్ డి‌సి‌సి‌బి ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా ఇదంతా బీజేపీనే చేయిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి లిక్కర్ స్కామ్, క్యాసినో వ్యవహారాల్లో ఈడీ దాడులతో టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెరిగిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version