రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ ఓ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ 1 గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ 2 గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారు. వీరితో పాటు 14 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ లో పేర్లు చేర్చారు. వీరందరిపైనా చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు సంస్థ సీఐడీ రంగంలోకి దిగింది. ఇక ఈ కేసులో నారాయణ అరెస్టు కానున్నారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రం లీకేజీలో ఆయన ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఇవాళ హైద్రాబాద్ లో నారాయణ దంపతులు అరెస్టు అయ్యారు. ప్రస్తుతం వీరిని చిత్తూరు కోర్టుకు తరలిస్తున్నారు.
ఇక తాజాగా నమోదయిన అభియోగాల నేపథ్యంలో ఒకటి సీఆర్డీఏ ను అడ్డుపెట్టుకుని మాస్టర్ ప్లాన్ లో అనేక మార్పులు చేసి ఆర్థిక లబ్ధి పొందారని, రెండు తన వారికి అనుగుణంగా అనుకూలంగా రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో మార్పులు చేశారని ఆరోపిస్తూ కేసు వివిధ చట్టాల కింద నమోదు అయింది. వీటిలో కొన్ని నాన్ బెయిల్ బుల్ చట్టాలను అనువర్తింపజేశారు. ఇక ఈ కేసులో నారాయణ అరెస్టు అవ్వడం ఖాయమని పోలీసు వర్గాలు అంటున్నాయి. నారాయణతో్ పాటు చంద్రబాబు కూడా అరెస్టు అవుతారా అన్న సందిగ్ధత ఒకటి ఇప్పుడు నెలకొని ఉంది. చంద్రబాబు అరెస్టు అయితే వైసీపీ ఓ విధంగా విపక్ష పార్టీపై విజయం సాధించినట్లవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి ! ఇవాళ ఏ క్షణాన ఏమౌతుందో అన్నది చంద్రబాబు కానీ ఆయన వర్గాలు కానీ పెదవి విప్పితే కానీ అసలు విషయం తేలదు.