అధికారులతో కుమ్మకై… అధికారంలోకి చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు, దౌర్జన్యాలకు కూటమి అభ్యర్థులు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఆదేశాలను ఆసరాగా చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి నేతలు కొందరు అధికారులతో కుమ్మకైయ్యారు. అందుకు స్వతంత్ర అభ్యర్థులు అడ్డొస్తారని వారికి ఏజెంట్లను కుదించడమే ఇందుకు నిదర్శనం. కూటమికి ఓటమి తప్పదని భావించిన అభ్యర్థులు టీడీపీ సానుభూతిపరులైన అధికారుల ద్వారా మరికొందరు అధికారులను రకరకాల ప్రలోభాలతో లోబరుచుకున్నారు. వారందరికీ కౌంటింగ్ కేంద్రంలో డ్యూటీలు వేయించుకున్నారు. వారి సహకారంతో కౌంటింగ్‌ కేంద్రంలో అక్రమాలు, దౌర్జన్యాలకు దిగారు.

అడ్డదారుల్లోనైనా గెలుపొందాలని కూటమి నేతలు అన్ని మార్గాలను ఎంచుకున్నారు. ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపు సమయంలో కూటమి ఏజెంట్లు రచ్చచేసి వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల దృష్టి మరల్చేందుకు పథకం వేశారు. ఈవీఎంలోని మొత్తం ఓట్ల లెక్కింపు విషయంలో తమకు అనుకూలంగా లెక్కలను తారుమారు చేసేందుకు స్కెచ్‌ వేసినట్లు సమాచారం. మొత్తంగా నేటి కౌంటింగ్‌ సమయంలో అడ్డదారులన్నింటినీ ఉపయోగించుకుని పైచేయి సాధించేందుకు కూటమి నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు కౌంటింగ్‌ కేంద్రంలో అక్రమాలు, దౌర్జనాలకు తావులేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులు, ఓటర్లు కోరుతున్నారు.

అధికారులంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేసిన కూటమి నేతలు.. కౌంటింగ్‌లో దాన్ని అవకాశంగా వినియోగించుకునేందుకు కుయుక్తులు పన్నారు. ఇందులో భాగంగా ఈసీ ఆదేశాలను బూచీగా చూపి వీలైనన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను కూటమి అభ్యర్థికి అనుకూలంగా మలచుకున్నారు. అందుకు అడ్డుగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను రెచ్చగొట్టి బయటకు పంపారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల విషయంలోనూ ముందే అడ్డుకట్ట వేశారు.

టేబుల్‌కి ఒక ఏజెంట్‌ని నియమించుకునే అవకాశం అభ్యర్థి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే టేబుల్‌కి ఒక ఏజెంట్‌ని ఏర్పాటు చేసుకునే అవకాశం కలిపించారు. స్వతంత్ర అభ్యర్థుల విషయానికి వచ్చే సరికి కేవలం 5, 6 మంది ఏజెంట్లను మాత్రమే నియమించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. కౌంటింగ్‌ కేంద్రంలో కూటమి నేతలకు బలం ఎక్కువ ఉండడంతో అక్రమాలు, దౌర్జన్యాలు చేసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బలగంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను వీలైనన్ని కూటమి అభ్యర్థి లెక్కలో వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో ఏ చిన్న పొరబాటు ఉన్నా.. కూటమి అభ్యర్థి అకౌంట్‌లో వేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version